హిందూ సంప్రాదాయంలో కొబ్బరి కాయకు విశిష్ట స్థానం ఉంది. ఇంట్లో ఎలాంటి శుభకార్యం నిర్వహించినా.. గుడికి వెళ్లినా.. పూజ చేసినా.. చివర్లో కొబ్బరి కాయ కొట్టడం తప్పని సరి. ఇక పూజలో వినియోగించే సామాగ్రిని పరమపవిత్రమైనదిగా భావిస్తాం. దాన్ని సొంతం చేసుకునేందుకు ఎంత డబ్బు చెల్లించేందుకైనా రెడీ అవుతారు. వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహం దగ్గర ఉంచిన లడ్డు వేలం పాట ఈ కోవకే వస్తుంది. లక్షలు చెల్లించి మరీ లడ్డు వేలం పాట పాడి దాన్ని దక్కించుకుంటారు భక్తులు. తాజాగా ఇలాంటి సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. కళ్యాణోత్సవంలో ఉంచిన కొబ్బరి కాయను 66 వేల రూపాయలకు ఓ భక్తుడు సొంతం చేసుకున్నాడు. ఆ వివరాలు..
ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తేని జిల్లా బోడి ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రతి ఏటా స్కందషష్టి ఉత్సవాలు నిర్వహిస్తారు. దానిలో భాగంగా.. ఈ ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలో వళ్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజలో ఉంచిన వస్తువులను వేలం వేశారు. ఈ క్రమంలో కళ్యాణోత్సవంలో వాడిన కొబ్బరి కాయను ఓ భక్తుడు ఏకంగా 66 వేల రూపాలయు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఈ కొబ్బరికాయను ఇంట్లో ఉంచి పూజలు నిర్వహిస్తే.. ఐశ్వర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఇక గతేడాది ఈ కొబ్బరికాయ 27 వేల రూపాయలు పలికింది.