రతన్ టాటా జనం మెచ్చిన పారిశ్రామికవేత్తగా ప్రసిద్ధి చెందారు. శత్రువులంటూ లేని వ్యాపారవేత్త. దేశం పట్ల భక్తి, సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప వ్యక్తిగా పేరొందారు. ఆయన ఉద్యోగుల పట్ల బాస్ లా కాకుండా.. తోటి ఉద్యోగిలానే ప్రవర్తిస్తారు. ఎంత డబ్బు సంపాదించినా గానీ నిరాడంబరంగా ఉంటారు. సాధారణ వ్యక్తిలా ఉంటారు. సాయం చేయడంలోనూ ముందుంటారు. విద్య, వైద్యం, రూరల్ డెవలప్మెంట్ వంటి వాటి కోసం టాటా గ్రూప్ కంపెనీల నుంచి వచ్చిన ఆదాయంలో 60 శాతానికి పైగా ఖర్చు చేస్తారు. సమాజం నుంచి తీసుకున్నాం కదా అని తిరిగి అదే సమాజానికి తిరిగిచ్చే అసలైన శ్రీమంతుడు రతన్ టాటా. ప్రజలతోనే ఇలా ఉన్నారంటే.. కంపెనీలో పని చేసే ఉద్యోగుల పట్ల ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
కారు డ్రైవర్ కూడా ఆయనతో ప్రేమగా మాట్లాడేంత చనువు ఆయన ఇస్తారు. అలాంటిది ఒక ఉద్యోగి కోసం విమానం నడిపేందుకు సిద్ధమయ్యారు రతన్ టాటా. 2004 లో ఆగస్టు నెలలో జరిగింది ఈ సంఘటన. అప్పుడు టాటా మోటార్స్ ఎండీగా ఉన్న ప్రకాష్ ఎం తెలంగ్ అవస్ధతకు గురయ్యారు. ఆ సమయంలో పూణేలో ఉన్నారు. వెంటనే ముంబైకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. రోడ్డు మార్గంలో వెళ్తే 3 గంటలు పైనే పడుతుందని ఎయిర్ అంబులెన్స్ లో తీసుకెళ్లాలని అనుకున్నారు. ఆరోజు ఆదివారం కావడంతో ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయలేకపోయారు. ఈ విషయమై ఉద్యోగులు రతన్ టాటాను సంప్రదించారు. దీంతో టాటా కంపెనీకి చెందిన విమానంలో ప్రకాష్ ని తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
టాటాకు పైలట్ లైసెన్స్ ఉండడంతో స్వయంగా తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఎయిర్ అంబులెన్స్ రావడంతో.. ప్రకాష్ ని ముంబై ఆసుపత్రికి తరలించారు. చికిత్స విజయవంతంగా జరగడంతో ఆయన ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే అప్పుడు ఎయిర్ అంబులెన్స్ రాకపోయి ఉంటే రతన్ టాటానే స్వయంగా తన విమానంలో తీసుకెళ్లి హాస్పిటల్ లో అడ్మిట్ చేసేవారు. రతన్ టాటా పైలట్ గా శిక్షణ పొందిన వ్యక్తి. ఫ్లైయింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉన్నారు. ఆయనకి విమానాలు నడపడం అంటే ఇష్టం. ఆయన దగ్గర డస్సాల్ట్ ఫాల్కన్ 2000 ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీని విలువ రూ. 150 కోట్లు. 2007లో అమెరికన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎఫ్-16లో ప్రయాణం చేశారు.
69 ఏళ్ల వయసులో అమెరికన్ విమానాన్ని నడిపిన సీనియర్ భారతీయ పౌరుడిగా రతన్ టాటా గుర్తింపు పొందారు. యుద్ధ విమానం కాక్ పిట్ లో కనిపించిన రతన్ టాటాకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. 2011లో బెంగళూరు ఎయిర్ షోలో బోయింగ్ ఎఫ్-18 సూపర్ హార్నెట్ విమానంలో కూడా రతన్ టాటా ప్రయాణించారు. విమానాలు నడపడం అంటే టాటాకు ఒక హాబీ. అలా ఉద్యోగి ప్రాణాలు కాపాడేందుకు విమానం నడపడానికి సిద్ధమయ్యారు. మరి మంచి మనసున్న రతన్ టాటాపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.