సాధారణంగా కార్లు, బైక్స్ అమ్మకాలపై ఆఫర్ల గురించి వింటూ ఉంటాం. ఫెస్టివల్స్ సమయాల్లో ఆయా కంపెనీలు భారీగా డిస్కౌంట్స్ ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటాయి. కానీ హెలికాప్టర్ అమ్మకాలపై కూడా ఆఫర్ల ఉంటాయని మీకు తెలుసా? అయితే ఏ హెలికాప్టర్ కంపెనీయో ఆఫర్ ప్రకటించిందని అనుకుంటే పొరపాటే. అది కూడా తక్కువ ధరకు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే ఉన్నప్పుడు ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీకి చెందిన ట్విన్ ఇంజిన్ 109 హెలికాప్టర్ ను రూ. 30 కోట్లతో కొనుగోలు చేశారు. ఆమె సీఎంగా ఉన్నప్పుడు అధికార కార్యక్రమాలకు ఈ హెలికాప్టర్ ను వినియోగించారు. ఇప్పుడమ్ముదామంటే ఖరీదైన, భద్రతా సదుపాయాలున్న హెలికాప్టర్ ను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
రాజస్థాన్ సీఎంతో పాటు ఇతర వీవీఐపీలు ఏ అధికారిక కార్యక్రమాలకు వెళ్లాలన్నా అందులోనే వెళ్లేవారు. కానీ 2011 నుంచి అది హ్యాంగర్‌కే పరిమితమయింది. అప్పటి సీఎం అశోక్ గహ్లోత్ ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్లో సాంకేతిక సమస్య వచ్చింది. పైలట్, సీఎం వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై సురక్షిత ప్రదేశంలో దానిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సీఎం ప్రాణాలను ముప్పులోకి నెట్టిన ఆ హెలికాప్టర్ ఇక ప్రయాణించడానికి సురక్షితం కాదని దానిని షెడ్డుకే పరిమితం చేశారు. మరోసారి హెలికాప్టర్ అమ్మకంపై రాజస్థాన్ ప్రభుత్వం దృష్టిసారించింది. హెలికాప్టర్ వేలానికి ఏర్పాట్లు చేయాలని సివిల్ ఏవియేషన్ అధికారులను ఆదేశించారు. రిజర్వ్ ధరకు అటూ ఇటూ అయినా సరే..ఈసారి హెలికాప్టర్‌ను విక్రయించాలని సూచించారు.
ఐతే గత పదేళ్లుగా ఒక్క సీఎం కూడా అందులో ప్రయాణించకపోవడంతో దానిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరి ఈ సారైనా ఆ హెలికాప్టర్ అమ్ముడవుతుందా? లేదంటే మరింతగా తుప్పుబట్టి తుక్కుగా మారుతుందా? చూడాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆర్య ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. దాని కండిషన్ ఎలా ఉంది? రేట్ ఎంత ఫిక్స్ చేయవచ్చు? అనే అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. స్పేర్స్, టూల్స్‌తో కలిపి హెలికాప్టర్ కనీస ధరను రూ.4 కోట్లుగా నిర్ణయించారు. ఇంకెందుకాలస్యం కొనేస్తే పోలా!!.
