సాధారణంగా దొంగలు ఏం దొంగిలిస్తారు? డబ్బులు, నగలు, కార్లు, ఫొన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలిస్తారు. మరి కొందరు దొంగలైతే మనం ఊహించలేని వస్తువులను దొంగలిస్తారు. షాపుల్లో, ఇళ్లల్లో దొంగతనాలు చేయడం మనం చూశాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే దొంగతనం గురించి మీరు ఇంత వరకు విని, చూసి ఉండరు. రాజస్థాన్ కు చెందిన ఓ దొంగల ముఠా చేసిన దొంగతనం చూస్తే మీకు నవ్వాగదు. దొంగతనానికి దర్జాగా కార్లో వచ్చిన చిల్లర దొంగలు.. ఎవరూ ఊహించని వస్తువును దొంగిలించారు. ఈ వీడియో మెుత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇంతకీ వారు దొంగిలించిన వస్తువు ఏంటీ అనుకుంటున్నారా? మరిన్ని వివరాల్లోకి వెళితే..
అది రాజస్థాన్ లోని ఝున్ ఝున్ ప్రాంతం.. కొల్సియా గ్రామంలో ఓ వాడ. అర్దరాత్రి కావడంతో అందరు పడుకున్నారు. అప్పుడే వచ్చింది అక్కడికి ఒక కారు.. కారులోంచి దిగారు ఇద్దరు వ్యక్తులు, ఏం దొంగలిస్తారా? అని ఆత్రుతగా చూస్తున్నారు మెుదటగా ఈ వీడియో చూసే నెటిజన్లు. ఆ వ్యక్తులు ఓ దుకాణంలో ముందు ఉన్న కరెంట్ బల్బును దొంగిలించడానికి ప్రయత్నించారు. లైట్ అందకపోవడంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిని తన భుజాలపై ఎక్కించుకున్నాడు. అయినా లైట్ అందలేదు. దాంతో ఎదురుగా కుర్చీ ఉండటంతో దాన్ని తీసుకొచ్చాడు. కానీ ఎదురుగా ఉన్న పోల్ కు మరో లైట్ ఉందని మరో వ్యక్తి చెప్పడంతో కుర్చీ సాయంతో ఆ లైట్ ను దొంగలించి కారులో పరారయ్యారు చిల్లర దొంగలు.
ఈ క్రమంలోనే బయట షటర్ సౌండ్ రావడంతో లేచానని దుకాణం యజమాని మహేంద్ర దూత్ చెప్పాడు. అప్పటికే ఎదురుగా ఉన్న బల్బ్ తీసుకుని వెళ్లి పోయినట్లు అతడు తెలిపాడు. ఇక ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే దొంగలు అన్ని లైట్స్ తీసి షాపుల్లో దొంగతనాలకు పాల్పడాలని చూశారా? లేక వేరే ఏదైన చేయడానికి రెక్కీ నిర్వహిస్తున్నారా? అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మీరేం దొంగల్రా.. చిల్లర గాళ్ల లెక్క ఉన్నారు. అసలు లైట్స్ తీసుకెళ్లీ ఏం చేసుకుంటార్రా? కనీసం కారు డిజిల్ మందమైనా డబ్బులు వస్తాయా? అంటూ సరదా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.