ఇటీవల కాలంలో గుండెపోటుతో ఆకస్మాత్తుగా మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలా జిమ్ చేస్తూ.. ఉన్నట్లుండి మృతి చెందిన సంగతి తెలిసిందే. కోలాటమాడుతూ, డ్యాన్స్ చేస్తూ.. నాటకం ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలిని వారిని గురించి కూడా చదివాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరొకటి వెలుగు చూసింది. పంటి నొప్పి ట్రీట్‌మెంట్ కోసం వచ్చిన వ్యక్తి.. పేపర్ చదువుతూనే మృతి చెందాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
సూరత్‌లో నివాసం ఉండే వస్త్ర వ్యాపారి దిలీప్ కుమార్.. ఓ కార్యక్రమంలో పాల్గొనడం కోసం నవంబర్ 4న రాజస్థాన్ వచ్చారు. అయితే పన్ను నొప్పి ఇబ్బంది పెట్టడంతో.. చికిత్స కోసం నవంబర్ 5న స్తానికంగా ఉన్న డెంటల్ క్లినిక్‌కు వెళ్లాడు. డాక్టర్‌ను కలిసేందుకు బయట క్యూలో కూర్చున్నాడు. ఈ క్రమంలో అక్కడే బెంచీ మీద ఉన్న పేపర్ తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఇంతలో ఉన్నట్లుండి కుప్పకూలి మృతి చెందాడు.
ఇది గమనించిన వెంటనే అక్కడే ఉన్న క్లినిక్ సిబ్బంది వెంటనే దిలీప్ వద్దకు చేరుకుని సాయం అందించేందుకు ప్రయత్నించారు. వెంటనే మరో ఆస్పత్రికి తరలించారు. కానీ ఆలోపే అతడు మృతి చెందాడు. శనివారం ఉదయం వరకు బాగానే ఉన్న దిలీప్.. ఇలా అకస్మాత్తుగా కుప్ప కూలడానికి కారణాలు తెలియడం లేదు అంటున్నారు కుటుంబ సభ్యులు. బహుశా గుండెపోటు కారణంగా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఇక శనివారమే దిలీప్ అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై డాక్టర్లు కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.