దేశాభివృద్ధిలో మహిళల పాత్ర చాలా కీలకమైనది. అందుకే మహిళాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. మహిళల అభ్యున్నతి గురించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా మహిళల కోసం మరో సరికొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, మూడేళ్ల పాటు ఉచిత 4G ఇంటర్ నెట్ అందించాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం సీఎం డిజిటల్ సేవ యోజన పథకం పేరుతో ముందుకొచ్చింది అశోక్ గెహ్లోత్ సర్కారు. వివరాల్లోకి వెళ్తే…
ప్రస్తుతం రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో అశోక్ సర్కారు.. ప్రజలను ఆకర్షించేందుకు కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుంది. అందుల్లో భాగంగా ముఖ్యమంత్రి డిజిటల్ సేవ యోజన్ పథకం ప్రారంభించారు. వాస్తవానికి ఈ పథకాన్ని ఈ ఏడాది బడ్జెట్‌లోనే ప్రకటించారు. అయితే తాజాగా ఈ స్కీమ్ కి సంబంధించిన విధివిధానాలు, టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెలాఖరుకల్లా బిడ్లను ఖరారు చేయనున్నారు. ఇందుకోసం మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా పోటీ పడుతోంది.
వీలైనంత త్వరగా తొలిదశ స్మార్ట్‌ఫోన్ల పంపిణీ చేపట్టాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం అందిస్తున్న చిరంజీవి ఆరోగ్య భీమా పథకం కింద ఉన్న కుటుంబాల్లోని దాదాపు 1.35 కోట్ల మంది మహిళలకు ఈ స్మార్ట్ ఫోన్లు అందించనున్నారు. వీరికి మూడేళ్ల పాటు ఉచితంగా 4G ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇందులో మొదటి సిమ్‌కార్డు లాక్ చేసి ఉంటుంది. రెండో సిమ్ స్లాట్‌లో ఇంకో సిమ్ కార్డు వేసుకునే వీలుంటుంది. ఒక్కో మొబైల్ హ్యాండ్‌సెట్ ధరకి రూ.5639కానున్నట్లు సమాచారం. పేద మహిళలకు సాధికారత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉచిత డేటా-ఎనేబుల్ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను అందించిన దేశంలోని మొదటి రాష్ట్రంగారాజస్తాన్ నిలిచింది.
ఈ పథకంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ మాట్లాడుతూ…. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా సదరు మహిళల పిల్లలు ఆన్‌లైన్‌లో అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుందని, అంతేకాకుండా గ్రామ మహిళలు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారని అన్నారు. వచ్చే ఏడాది 2023-24 వార్షిక బడ్జెట్‌ను యువత, విద్యార్థులకు అంకితం చేయనున్నామని సీఎం అన్నారు. మరి.. రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.