రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ అంటే రాజకీయాలు, మోదీ, బీజేపీ వంటి వాటితో పాటు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరీ ముఖ్యంగా పెళ్లి ప్రస్తావన తప్పకుండా వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రశ్న ఎదురయ్యింది రాహుల్‌కి. మరి ఆయన సమాధానం ఏంటంటే..
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ప్రస్తుతం రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. బీజేపీపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఇక రాజకీయాల సంగతి పక్కన పెడితే.. రాహుల్ గాంధీ ప్రస్తావన రాగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన పెళ్లి ప్రస్తావనే. ఇప్పటికి కూడా దేశంలోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో రాహుల్ గాంధీ పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ వయసు 52 ఏళ్లు. కానీ ఇప్పటికి కూడా ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకురావడం లేదు. గతంలో జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ.. తన తల్లి, నానమ్మలో ఉన్న లక్షణాలున్న అమ్మాయి అయితే పెళ్లికి ఓకే అన్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రాహుల్ గాంధీ. ఆ వివరాలు..
తాజాగా రాహుల్ గాంధీ.. ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోతన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన సోదరి ప్రియాంక గాంధీతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. తనకు నానమ్మ ఇందిరా గాంధీతో ఎక్కువ చనువు ఉంటే.. తన సోదరి ప్రియాంకకు ఇటాలియన్ అమ్మమ్మతో చనువు ఎక్కువ అని తెలిపారు. అలానే ఈ ఇంటర్య్వూలో కూడా రాహుల్ గాంధీ తన వివాహానికి సంబంధించి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పెళ్లి, పిల్లల గురించి రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూ సందర్భంగా ఎందుకు మీరు ఇంతవరకూ వివాహం చేసుకోలేదని రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. ‘‘ఈ విషయం నాకే వింతగా ఉంది. పెళ్లి ఎందుకు చేసుకోలేదో నాకే తెలియదు. అయితే నాకు కూడా పెళ్లి చేసుకోవాలని, పిల్లలకు తండ్రిగా ఉండాలని ఉంది’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే తన గడ్డం గురించి కూడా ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్. ‘‘భారత్ జోడో యాత్ర పూర్తయ్యేవరకు గడ్డం తీయకూడదు అనుకున్నాను. అందుకే తీయలేదు. ఇప్పుడు ఉంచాలో లేదో ఆలోచిస్తున్నాను’’ అన్నారు.
అంతేకాక తనకు నానమ్మ ఇందిరా గాంధీతో ఎక్కువ చనువు అని.. అలానే తన సోదరి ప్రియాంకకు ఇటాలియన్ అమ్మమ్మ పావోలా మైనోతో ఎక్కువ చనువు ఉండేదని తెలిపారు. ఇక పావోలోమైనో గత ఏడాది మృతి చెందారు. అలానే ఈ ఇంటర్వ్యూలో రాజకీయాలపై కూడా స్పందించారు రాహుల్ గాంధీ. ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ దృక్పథాన్ని ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించవచ్చన్నారు. విపక్షాలు ఏకమైతే నూటికి నూరు శాతం మోదీని ఓడించవచ్చని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరలుతోంది. మరి పెళ్లి, పిల్లలపై రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.