అస్సలు చదువుకోలేదు. తండ్రుల నుంచి వచ్చిన విద్యను వారసత్వంగా తీసుకున్నారు. అదే ఆస్తిగా భావించారు. ఏసీ గదుల్లో ఉద్యోగాలు, కంప్యూటర్ ముందు కూర్చోడాలు లేని జీవితం వారిది. చెట్లంట, పుట్లంట తిరగడమే పని. అడవి తల్లిని నమ్ముకునే జీవించే జాతి వారిది. ఎన్నో ఏళ్లుగా చీకటిలో ఉండిపోయిన జాతికి చెందిన మనుషులు వాళ్ళు. కొద్దో గొప్పో చదువుకుని.. ఉద్యోగం రాలేదని బాధపడే యువత ఉన్న ఈరోజుల్లో.. తండ్రి వృత్తినే వారసత్వంగా అందిపుచ్చుకుని.. అదే తమ ఆస్తిగా భావించి.. ఇవాళ ప్రపంచం మెచ్చిన వ్యక్తుల జాబితాలో నిలిచారు. పద్మశ్రీ అవార్డు సైతం వరించే అవకాశం పొందారు. కొండచిలువల సమస్యతో బాధపడుతున్న అమెరికాకు పరిష్కారం చూపించారు. వాళ్ళు మరెవరో కాదు.. వడివేల్ గోపాల్, మాసి సడైయన్ లు.
అమెరికాలోని ఫ్లోరిడాలో భారీ కొండ చిలువలు విధ్వంసం సృష్టిస్తుంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి భయం పట్టుకుంది. కొండచిలువల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం పెద్ద సమస్యగా మారింది. అయితే ఈ సమస్యకు తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరిష్కారం చూపించారు. 1000 మంది కలిసి కొన్ని నెలల పాటు 106 కొండచిలువలను పట్టుకుంటే.. వీరిద్దరూ ఒక్క నెలలో 30 కొండచిలువలను పట్టేవారు. ఇండియా గ్రేట్ అంటూ నినాదాలు చేసేలా భారత్ పేరుని నిలబెట్టారు. ఆ ఇద్దరే.. వడివేల్ గోపాల్, మాసి సడైయన్ లు. అరుదైన ఇరుళర్ తెగకు చెందిన వీరిద్దరూ ప్రపంచవ్యాప్తంగా విషపూరిత పాములను పడుతూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. వీరి స్వస్థలం చెంగల్పట్టు జిల్లా చెన్నేరి అనే చిన్న గ్రామం. చిన్నప్పటి నుంచి అడవిలోనే తమ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
తండ్రుల నుంచి వారసత్వంగా పాములు పట్టే విద్యను నేర్చుకున్నారు. ఎలాంటి విషపూరిత పామునైనా సులువుగా, వేగంగా లొంగదీసుకోవడంలో వీరు సిద్ధహస్తులు. 2016-17 మధ్య వీరి ప్రతిభ అప్పుడప్పుడే వెలుగులోకి వస్తుంది. ఆ సమయంలో అమెరికాలోని ఫ్లోరిడాలో పలు ప్రాంతాల్లో బర్మీస్ పైథాన్ లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఒక్కో కొండచిలువ 15 నుంచి 23 అడుగులు ఉంటుంది. జంతువులను అమాంతం తినేస్తూ భయాన్ని కలిగించేవి. ఫ్లోరిడా ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక.. చివరికి కొండచిలువలను చంపినవారికి నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఈ విషపూరిత పాములను పట్టేవారిని చూపించాలని పోటీలు నిర్వహించింది. ఆ సమయంలో ప్రఖ్యాత అమెరికన్-ఇండియన్ సర్పాల పరిశోధకుడు అయిన రోములస్ ఎర్ల్ విటేకర్ కు వీరి గురించి తెలిసింది.
ఈయన ఈ వడివేల్ గోపాల్, మాసి సడైయన్ ల గురించి ఫ్లోరిడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సాంప్రదాయ పద్ధతిలో కొండచిలువలను పడుతున్న వీరి తీరు చూసి అక్కడి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అమెరికాలో నిష్ణాతులు సైతం చేయలేని పనిని వీళ్ళు చేసి చూపించారు. వెయ్యి మంది కలిసి కొన్ని నెలల తరబడి 106 కొండచిలువలను పడితే.. వీరిద్దరూ ఒక్క నెలలోనే 30కి పైగా కొండచిలువలను పట్టుకునేవారు. వీళ్ళు పాములను పట్టడమే కాకుండా అక్కడ స్థానికులకు కూడా ఈ విద్యలో శిక్షణ ఇచ్చేవారు. దీంతో ప్రజలు వీరిని ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత వీరిద్దరూ పలు దేశాలకు వెళ్లి శిక్షణ ఇస్తున్నారు. విష సర్పాలపై పరిశోధన చేయడం కోసం థాయ్ లాండ్ దేశ నిపుణులు వీరి సాయం కోరడం విశేషం. విషపూరిత పాములు పడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వీరు చేస్తున్న సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.
అయితే భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించినప్పుడు వీరు కరూరు జిల్లాలో ఉన్నారు. తమకు పద్మశ్రీ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పద్మశ్రీని తాము గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. ఈ విజయానికి రోములస్ విటేకర్ కారణమని తెలిపారు. ఇక తమిళనాడు రాష్ట్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు మాట్లాడుతూ.. ఇరుళర్ తెగకు చెందిన వారికి పద్మశ్రీ గౌరవం దక్కడం ఆనందంగా ఉందని.. వారి ప్రయాణం సాహసోపేతమైనదని, మన దేశానికి చెందిన వ్యక్తుల జ్ఞానాన్ని ఎన్నో దేశాలు పొందడం అనేది గర్వకారణమని అన్నారు.
ఇరుళర్ తెగ అనేది భారతీయ జనాభా లెక్కల ప్రకారం అత్యంత అరుదైన తెగ. ఇరుళర్ అంటే తమిళంలో చీకటి అని అర్థం. చీకటిలోనే వారి జీవితాలు ఉంటాయని అంటారు. వీరి మీద 2021లో ఒక సినిమా కూడా వచ్చింది. అది సూర్య నటించిన జై భీం. ఈ సినిమాతో చాలా మందికి ఈ తెగ ఒకటి ఉందని.. వీళ్లూ మనుషులే అన్న సంగతి ఈ దేశం గుర్తించింది. ఇరుళర్ తెగ వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టడం, వారిపై దాడులు చేయడం వంటివి ఈ సినిమాలో చూపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వీరు 2.13 లక్షల మంది ఉన్నారు. అడవుల్లోనే జీవిస్తారు. ఆధునిక ప్రపంచంతో సంబంధం ఉండదు. పాములు పట్టుకోవడం, అడవుల్లో తేనె సేకరించడం, పొలాల పనులు చేసుకోవడం తప్పితే.. వేరే ఏ పనీ తెలియదు.
జంతువులతో ఎలా మెలగాలో వీళ్ళకి తెలుసు. పాము కనిపిస్తే.. అది విషపూరితమా, కదా అనే ఒకసారి చూసి చెప్పేస్తారు. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం తరపున ఈ తెగ వారు వేటగాళ్లుగా కొనసాగుతున్నారు. చెన్నై శివారు ఈసీఆర్ లో వడనెమ్మేలిలో ఇరుళర్ పాములు పట్టేవారి పారిశ్రామిక సంక్షేమ సంఘం ఒకటి ఏర్పాటైంది. గత 50 ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. ఇందులో ఈ ఇరుళర్ తెగ వారికి పాములు పట్టడంపై శిక్షణ ఇస్తుంటారు. పాముల నుంచి తీసిన విషాన్ని ఇక్కడి నుంచి కొన్ని ఔషధ సంస్థలకు వెళ్తాయి.
ఈ విషంతో పాము కాటు ఔషధాలను తయారుచేస్తారు. తెగలో చదువుకున్న వాళ్ళు పెద్దగా ఉండరు. చదువు, ఉద్యోగం ఏమీ ఉండవు. ఎవరికైనా ఉద్యోగం వస్తే చాలా గొప్పగా చూస్తారు ఆ తెగ వాళ్ళు. అలాంటిది ఇరుళర్ తెగకు చెందిన వడివేల్ గోపాల్, మాసి సడైయన్ లు తమ తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న పాముల విద్యను ఉపాధిగా మలచుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మరి ఇరుళర్ జాతికే గౌరవం తీసుకొచ్చిన వడివేల్ గోపాల్, మాసి సడైయన్ లపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
I am happy to know that Vadivel Gopal and Masi Sadaiyan, Snake catchers from the #Irular tribal community of Tamil Nadu, have been announced for receiving #PadmaShri this year. My heartiest congratulations to them and other Padma awardees.(1/2) pic.twitter.com/Q8Y4lINfC8
— RAJ BHAVAN, TAMIL NADU (@rajbhavan_tn) January 25, 2023