ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే.. చలాన్లు కూడా భారీగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేయడం, రెడ్ సిగ్నల్ పడిన తర్వాత కూడా అలానే వెళ్లిపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్, ఆర్సీ వంటి ముఖ్యమైన కాగితాలు ఏవి లేకపోయినా సరే.. ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తుంటారు. దీని వల్ల ప్రభుత్వానికి బోలేడు ఆదాయం. ఇక అప్పుడప్పుడు పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వాలు డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఇస్తాయి. ఇవన్ని పక్కకు పెడితే దీపావళి సందర్బంగా ఓ చోట వారం రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలు ఎత్తేశారు. ఆ వారం రోజుల పాటు.. రూల్స్ పాటించకపోతే.. ఎలాంటి చలాన్లు విధించమని కూడా తెలిపింది ప్రభుత్వం. మరి ఇలాంటి వింత బంపరాఫర్ ఎక్కడ ప్రకటించారంటే..
దీపావళి సందర్భంగా ప్రభుత్వాలు ఉద్యోగులకు బోనస్, మిఠాయిలు పంపిణీ చేస్తుంది. ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు చిన్న చిన్న బహుమతలు ఇస్తాయి. కొన్ని కంపెనీలైతే ఏకంగా కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా ఇస్తాయి. ఇక పండుగ వేళ ఆన్‌లైన్ ఈ కామర్స్ సంస్థలు ప్రకటించే ఆఫర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఓ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటన్నింటిని తలదన్నే ఆఫర్‌ని ప్రకటించి వార్తల్లో నిలిచింది. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలు వారం రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఎలాంటి ఫైన్ విధించమని చెప్పుకొచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం ఈ బంపరాఫర్‌ని ప్రకటించింది.
దీపావళి పండుగ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఎలాంటి జరిమానాలు విధించకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవీ తెలిపారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ట్రాఫిక్ నిబంధనలను సడలిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే నిబంధనలు సడలించాం కదాని.. వాహనదారులు ఎలా పడితే అలా తమ ఇష్టారీతిగా ప్రవర్తించవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానా వేయరని, పువ్వులు ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెబుతారని అన్నారు.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఓట్ల కోసం ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శిస్తున్నారు. ఎందుకంటే.. త్వరలోనే గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగునున్నాయి. ఈ క్రమంలో ప్రజలను ఆకర్షించి ఓట్లు పొందడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. అంతేకాక ఓట్ల కోసం మీరు ఏమైనా చేస్తారని, ఇలాంటి నిర్ణయాల వల్ల చట్టాలపై ప్రజలకు నమ్మకం పోతుందని నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల పల్ల ప్రమాదాలు ఎక్కువైపోతాయని, ఓట్ల కోసం ప్రజల ప్రాణాలను తీయవద్దంటూ కొంతమంది నెటిజన్లు సూచిస్తున్నారు. మొత్తం మీద ఈ నిర్ణయం మాత్రం సంచలనంగా మారింది.