ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం ఎల్ఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఈ డెసిజన్ తప్పక ఊరట కలిగిస్తుందని చెప్పొచ్చు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద వార్త విని యావత్ దేశం మొత్తం ఉలిక్కిపడింది. మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఈ ఘటనలో మృతుల సంఖ్య 280కి పైగా ఉంది. బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 1,100కు పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒడిశా ప్రమాదం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందర్నీ కలచివేసింది. బాధితులకు సాయం చేసేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే.. ఈ ప్రమాదంలో ప్రాణాలు వదిలిన మృతుల పిల్లల చదువుల బాధ్యతలను తాను చూసుకుంటానన్నాడు. వారికి ఉచితంగా విద్యను అందిస్తానని హామీ ఇచ్చాడు. రైలు ప్రమాద బాధితుల విషయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
ఒడిశా విషాదంలో బాధితుల క్లెయిమ్ సెటిల్మెంట్ల కోసం పలు ఉపశమనాలు ప్రకటించింది ఎల్ఐసీ. ఈ ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు క్లెయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తామని జాతీయ బీమా సంస్థ పేర్కొంది. రైలు ప్రమాద బాధితుల కోసం ఎల్ఐసీ పాలసీలు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్లెయిందారుల కష్టాలను తగ్గించేందుకు ఎల్ఐసీ క్లెయిమ్ సెటిల్మెంట్ల కోసం వివిధ రాయితీలను ప్రకటించింది. డెత్ సర్టిఫికేట్లకు బదులుగా రైల్వే అధికారులు, పోలీసులు లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మృతుల జాబితాను మరణానికి రుజువుగా అంగీకరిస్తామని ఒక ప్రకటనలో ఎల్ఐసీ తెలిపింది. ఈ విషయంలో హక్కుదారులకు సాయం అందించేందుకు ఎల్ఐసీ డివిజనల్, బ్రాంచ్ స్థాయిలలో స్పెషల్ హెల్ప్ డెస్క్నూ ఏర్పాటు చేసింది. పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్లో ఉన్న అడ్డంకులను తొలగించి ఊరట కలిగిస్తున్నట్లు వివరించింది.