ఒడిశా పెను విషాద సమయంలోనూ కొందరు ‘చావు’ తెలివి ప్రదర్శిస్తున్నారు. తమ స్వార్థం కోసం డెడ్బాసీస్ను కూడా వదలడం లేదు నీచులు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద వార్త దేశ ప్రజలందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఒడిశా పెను విషాదంలో మృతి చెందిన వారి సంఖ్య దాదాపు 300కి చేరువలో ఉంది. బాలాసోర్‌లో జరిగిన ఈ ఘోర యాక్సిడెంట్లో గాయపడిన వారి సంఖ్య 11 వందలకు పైనే ఉంది. మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఈ ఘటనలో గాయపడిన వారిలో చాలా మంది డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారని డాక్టర్లు తెలిపారు. ఈ విషాద బాధితులను ఆదుకునేందుకు అందరూ తమ వంతు సాయం చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తానని భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాటిచ్చాడు. బాధితుల సహాయార్థం టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రూ.1 లక్షను విరాళంగా ప్రకటించాడు.
ఇక, బాధితుల క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరిస్తామని ఎల్ఐసీ వెల్లడించింది. ఇలా అందరూ తమ వంతుగా బాధితుల కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. అయితే కొందరు మోసగాళ్లు మాత్రం ఈ ప్రమాదంలో మరణించిన వారిని అడ్డుపెట్టుకుంటున్నారు. పరిహారం సొమ్ము కొట్టేయడానికి మృతదేహాలను వాడుకుంటున్నారు. నకిలీ సర్టిఫికేట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలను గుర్తించిన ఒడిశా సర్కారు అప్రమత్తమైంది. కటక్ నగరానికి చెందిన గీతాంజలి దత్తా అనే ఒక మహిళ రైలు ప్రమాద మృతుల ఫొటోలను ఉంచిన ప్రదేశానికి వచ్చింది. యాక్సిడెంట్ జరిగిన రోజు తన భర్త రైలులో ప్రయాణించాడని తెలిపింది. అక్కడి ఫొటోలను చూసిన తర్వాత ఒక వ్యక్తి ఫొటో చూపించి.. అతడే తన భర్త అని గీతాంజలి చెప్పింది. అయితే ఆమెపై అనుమానం కలగడంతో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఇన్వెస్టిగేషన్లో ఆమె భర్త బతికే ఉన్నాడని తేలింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారం కోసమే తాను ఇలా చేశానని గీతాంజలి అంగీకరించింది.