ఒడిశా రైలు ప్రమాదం జరిగిన ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న పలు మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవని తెలుస్తోంది. దీంతో వీళ్లు ఎలా చనిపోయారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో 275 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్ ఘటనలో దాదాపు 11 వందల మందికి పైగా ప్యాసింజర్లు గాయాలపాలయ్యారు. వారిలో కొంతమంది డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్లు చెబుతున్నారు. దేశ ప్రజలందర్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో బాధితులకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ వంతుగా సాయం అందిస్తున్నారు. ఈ ప్రమాద బాధితుల క్లెయిమ్ సెటిల్మెంట్లను త్వరగా పరిష్కరిస్తామని ఎల్ఐసీ ప్రకటించింది. ఒడిశా విషాద బాధితుల పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పిస్తానని డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హామీ ఇచ్చాడు. బాధితుల సహాయార్థం రూ.1 లక్షను విరాళంగా ప్రకటించాడు మరో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.
రైలు ప్రమాద బాధితులను ఆదుకునేందకు అందరూ తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాల్లో 40 డెడ్ బాడీస్ మీద ఎలాంటి గాయాలు లేవని తెలుస్తోంది. దీంతో వీళ్లు చనిపోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రమాదం తర్వాత ఓవర్‌హెడ్ కేబుల్ తెగిపడిన కారణంగా కరెంట్ షాక్‌కు గురై వీరు చనిపోయి మరణించి ఉంటారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. జీఆర్పీ సబ్ ఇన్స్పెక్టర్ పాపు కుమార్ నాయక్ పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్ ప్రకారం.. యాక్సిడెంట్ తర్వాత ఓవర్‌హెడ్ ఎల్టీ (లో టెన్షన్) లైన్ తాకినందునే పలువురు ప్యాసింజర్లు విద్యుదాఘాతానికి గురై చనిపోయి ఉంటారని సమాచారం.