భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో ధరలపై పెరుగుదలపై నెటిజన్లు తీవ్రంగానే స్పందిస్తున్నారు. ప్రజాగ్రహాన్ని పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరపై సెస్ తగ్గించింది. కానీ కేవలం రూ.5 తగ్గించి అభాసుపాలైంది. రాష్ట్రాలు కూడా తమ పన్నులు తగ్గించాలని కోరింది. అందుకు కొన్ని రాష్ట్రాలు ససేమీరా అన్నాయి. ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం అని వాళ్లే తగ్గించాలని తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు స్పష్టం చేశారు.
కాగా పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ధరలు తగ్గే అవకాశం ఉందనే వాదన ఉంది. ఇదే విషయమై తాజా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వాటిపై పన్నులు తగ్గుతాయని గడ్కరీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతిస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పకుండా వీటిని జీఎస్టీ పరిధిలో చేర్చేందుకు ప్రయత్నిస్తారాని గడ్కరీ పేర్కొన్నారు. ‘జీఎస్‌టీ మండలిలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా సభ్యులుగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తేవడాన్ని ఇష్టపడటం లేదు’ అని ఆయన తెలిపారు.