Tamil Nadu: ప్రేమ అందరి జీవితాల్లో తియ్యని జ్ఞాపకం అవ్వదు.. కొందరి మనసుపై మాయని గాయంలా మారి నిత్యం వేధిస్తుంటుంది. అదే గాయం మనసుతో పాటు మెదడును చేరితో మతి చలిస్తుంది. ప్రేమ వైఫల్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. మరెంతో మంది పిచ్చి వాళ్లుగా మారి ప్రతి నిత్యం ఛస్తూ బతుకుతున్నారు. ప్రేమ కోసం పిచ్చివాళ్లలా మారిన వారిలో పెద్ద పెద్ద చదువులు చదివిన విద్యావంతులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ కూడా ఓ విద్యావంతుడిదే.. ప్రేమ అతడి జీవితాన్ని ఎలా మార్చిందంటే..
తమిళనాడు, తెన్‌కాశీ జిల్లా తెన్నమలైకి చెందిన ముత్తు (35) ఎంతో తెలివైనవాడు, చదువరి. రాజపాళయంలో బీకాం, మద్రాసు యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. ముత్తు ఎంబీఏ చదువుతున్న టైంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే, ఆ ప్రేమ ఫెయిల్ అయింది. ఆ బాధనుంచి తేరుకుని అతడు బయట పడ్డానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత చెన్నైలోని ఓ కార్యాలయంలో ఉన్నత ఉద్యోగంలో చేరాడు. ఆఫీస్‌లో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే, ఈసారి కూడా ప్రేమ బెడిసి కొట్టింది. దీంతో తట్టుకోలేకపోయాడు.
2018 నవంబర్ 13న తను ఉంటున్న వర్కింగ్ బాయ్స్ హాస్టల్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యులు, బంధువులు ఎంత వెతికినా అతడి జాడ కనిపించలేదు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ముత్తు సమీప బంధువు మురుగన్ అతడ్ని గుర్తు పట్టలేని స్థితిలో పిచ్చివాడిగా గుర్తించాడు. ముత్తుతో మాటలు కలిపి ఆరా తీశాడు. ఊరు, పేరు చెప్పిన తర్వాత పిచ్చివాడు ముత్తునేనని నిర్థారించుకున్నాడు. పోలీసుల సహాయంతో అట్టలు కట్టిన పొడవాటి జుట్టు, గడ్డాన్ని తొలగించి గుండు కొట్టించాడు.
అనంతరం పోలీసులు ముత్తును తల్లిదండ్రులకు అప్పగించారు. ముత్తు సోదరుడు అయ్యనార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ముత్తు ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో గతంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడు. రెండు సార్లు ప్రేమ విఫలం కావటంతో పిచ్చివాడిలా మారాడు. చెన్నై నుంచి కాలినడకనే కన్యాకుమారి వరకు చేరి రోడ్డుపై బిచ్ఛగాడిలా ఇన్నాళ్లూ గడిపాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ముగిసిన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్.. తెలుగు రాష్ట్రాల్లో ఓటు వేయని ఎమ్మెల్యేల లిస్టు ఇదే..!