కొంతమంది ఏదైనా అనుకుంటే సాధించే వరకూ వదిలిపెట్టరు. అదే పనిగా తమ పనిని, ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. పలానా పని చేస్తే లక్షలు వస్తాయంటే దాని కోసం తమ ఇళ్ళని, పొలాలని అమ్మేసుకుంటారు. పిచ్చి అటువంటిది. పిచ్చి అనడం కంటే దాని మీద ఉన్న నమ్మకం అని అనవచ్చు. వజ్రాల గనుల్లో భూమిని లీజుకు తీసుకుని వజ్రాల కోసం వెతికేవాళ్లు చాలా మందే ఉంటారు. ఏళ్ల తరబడి తవ్వినా కూడా కొంతమందికి ఒక్క వజ్రం కూడా దొరకదు. కానీ కొంతమందికి మాత్రం అదృష్టం వరిస్తుంది. తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా శ్రమించిన వారికి లక్షలు, కోట్లు విలువ చేసే వజ్రాలు దొరుకుతాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలానే చూసాం.
తాజాగా ఒక కార్మికుడికి లక్షలు విలువ చేసే వజ్రం దొరికింది. మధ్యప్రదేశ్ లోని ఛతర్ పుర్ జిల్లాకి చెందిన హుక్మన్ అహిర్వార్ అనే కార్మికుడు వజ్రాల మీద ఇష్టంతో.. పన్నాలోని వజ్రాల గనిలో కొంత భూమిని లీజుకి తీసుకున్నాడు. రోజూ వజ్రాల వేటకు బయలుదేరి తవ్వకాలు మొదలుపెట్టేవాడు. ఇలా చాలా ఏళ్ల పాటు శ్రమించగా.. 8 చిన్న వజ్రాలు మాత్రమే దొరికాయి. గనుల తవ్వకం కారణంగా అప్పులు అవ్వడంతో.. ఆ అప్పు తీర్చడం కోసం తన రెండున్నర ఎకరాల భూమిని అమ్మేసుకోవాల్సి వచ్చింది. అయినా కూడా వజ్రాల వేట ఆపలేదు. అలా అన్వేషిస్తుండగా.. సోమవారం నాడు అతన్ని అదృష్టం వరించింది.
ఇన్నాళ్లు అతను పడిన కష్టానికి ఫలితం దక్కింది. 4.5 క్యారెట్ల వజ్రం దొరికింది. దాన్ని ఆ కార్మికుడు వజ్రాల కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు ఇచ్చాడు. అధికారులు వజ్రం ఖరీదు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేశారు. దీంతో కార్మికుడు ఆనందానికి హద్దులు లేవు. అతను అమ్ముకున్న రెండున్నర ఎకరాల భూమి ధర 5 లక్షల వరకూ ఉంటుంది. అతను ఉండే ఏరియాలో ఎకరం 2 లక్షలే. 5 లక్షలు పోయినా 5 నుంచి 7 లక్షలు లాభమే అని సదరు కార్మికుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.