ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.
సంక్షేమం అనేది రాజకీయాల్లో చాలా కీలకం. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా ఆర్థిక సహకారాన్ని అందజేస్తుంటాయి. ప్రజలకు ఏదైనా చేస్తామని హామీలు ఇస్తేనే గెలిపిస్తారు. ఆ హామీలు నెరవేరిస్తేనే మరోసారి గెలిపిస్తారు. అధికారంలోకి వచ్చాక ఆరునూరైనా సరే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. రైతు భరోసా, రైతులకు ఉచిత కరెంటు, ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణం, అమ్మ ఒడి, నేతన్న నేస్తం, వాహన మిత్ర ఇలా ఆయా ప్రభుత్వాలు అనేక రకాలుగా పథకాల రూపంలో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి.
తాజాగా ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రజలకు ఉచిత విద్యుత్ ని అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీని నిలబెట్టుకుంది జూలై 1 శనివారం అర్ధరాత్రి నుంచి గృహజ్యోతి పథకాన్ని అమలులోకి రానుంది. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు 5 ప్రధాన హామీలు ఇచ్చింది కాంగ్రెస్. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేలా శక్తి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ని అందించే పథకాన్ని అమలు చేయనుంది. జూలై 1 నుంచి 31 వరకూ 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికి బిల్లులు ఉండవు. 200 యూనిట్లు దాటితే మాత్రం బిల్లు కట్టాల్సిందే.
జూన్ 18 నుంచి గృహజ్యోతి కోసం దరఖాస్తులు ఆహ్వానించగా లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.రాష్ట్రంలో మొత్తం 2.14 కోట్ల మంది ఈ పథకానికి అర్హులుగా ఉన్నారని.. 50 శాతం కంటే తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని విద్యుత్ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే మరో పథకాన్ని కూడా ఈరోజు నుంచే అమలు చేస్తుంది. అన్న భాగ్య యోజన పథకాన్ని జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద రేషన్ కార్డు లబ్దిదారులకు 5 కిలోల బియ్యం ఇస్తారు. మిగతా 5 కిలోల బియ్యానికి బదులు కిలోకి రూ. 34 చొప్పున రూ. 170 లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు ఉచితంగా విద్యుత్ ని అందిస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.