ప్రపంచమంతటా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 ఓమిక్రాన్ సబ్-వేరియంట్ అయిన BF.7 వేగంగా విస్తరిస్తూ ఉంది. చైనాలో ఈ వేరియంట్ కారణంగా రోజుకి కొన్ని వేలల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే ప్రధాని మోడీ ఈ విషయంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలావుంటే.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బెంగళూరు, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చేసిన కరోనా టెస్టుల్లో 12 మంది ప్రయాణికులకు పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యింది. చైనా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి బెంగళూరు విమానాశ్రయంలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇతను ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందినవాడు. మిగతా పదకొండు మంది ప్రయాణికులు కరోనా హైరిస్క్ దేశాల నుండి వచ్చారు. నలుగురిని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో క్వారంటైన్ చేశారు. మిగిలిన వారిని హోం ఐసోలేషన్ లో ఉంచారు. అన్ని నమూనాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి జెనోమిక్ సీక్వెన్సింగ్ కు పంపారు.
విదేశాల నుంచి వస్తున్న వారిలో కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటంపై కర్నాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్కును తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. థియేటర్లు, విద్యా సంస్థలు, బార్లు, రెస్టారెంట్లలో మాస్కులు ధరించిన వారికే అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. న్యూ ఇయర్ వేడుకల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలు నిర్వహించుకోవాలని ఆదేశించింది. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు.. బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని సూచించింది. మరోవైపు.. ఉన్నావ్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలిన క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, ప్రస్తుతం ఆ యువకుడు దుబాయ్ వెళ్లాడు. అంతకు ముందే పరీక్షలు చేసుకోగా ప్రస్తుతం పాజిటివ్‌గా తేలింది. అతడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులతో పాటు 20 మంది నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.
Karnataka Govt pic.twitter.com/LRUolzKRFw
— RVCJ Media (@RVCJ_FB) December 26, 2022