ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం ఏదంటే.. టక్కున చైనా అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ చైనానే మన దేశం మించిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవలే చైనాలో జననాల రేటు తగ్గినట్లు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్.. చైనా జనాభాను దాటేసి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనాల ప్రకారం.. 2022 చివరి నాటికి భారతదేశం యొక్క జనాభా 141.7 కోట్లు కాగా.. ప్రస్తుత జనాభా (జనవరి 18 2023 నాటికి) 142.8 కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మరో ఇంటర్నేషనల్ మార్కెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మాకోట్రెండ్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం భారత జనాభా 142.8 కోట్లుగా ఉంది. ఇక చైనా జనాభా 141.2 కోట్లు కంటే తక్కువ అని ఇటీవలే చైనా ప్రకటించింది.
దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. చైనాలో ఒకవైపు జననాల రేటు తగ్గుతుండడం.. మరోవైపు వయోవృద్ధుల సంఖ్య పెరిగిపోతుండడంతో తమ దేశ జనాభా ఫస్ట్ టైం తగ్గిందని చైనా వెల్లడించింది. 2022 చివరి నాటికి చైనా జనాభా.. 8.50 లక్షలు తగ్గిందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ జనవరి 17న వెల్లడించింది. ప్రస్తుత చైనా జనాభా 141.18 కోట్లని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. ఈ సంఖ్యను భారత్ 2023 ఏడాది చివరి నాటికి అధిగమిస్తుందని ఐక్యరాజ్యసమితి గతంలో అంచనా వేసింది. అయితే మనోళ్ల కృషి ఫలితంగా ఈలోపే చైనాను క్రాస్ చేసేసినట్లు స్పష్టవుతోంది. 2050 నాటికి భారత్ జనాభా 167 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.
మరోవైపు ప్రపంచ జనాభా కూడా 800 కోట్ల మార్కును దాటింది. 2022 నవంబర్ 15న పుట్టిన శిశువుతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు ఉంటే.. 48 ఏళ్లలో డబుల్ అయ్యి 800 కోట్లు దాటింది. ఏది ఏమైనా చైనాను భారత్.. జనాభా విషయంలో దాటేసిందని వచ్చిన నివేదికల పట్ల కొంతమంది భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఏవేవో కనిపెడుతుంటే.. మన వాళ్ళు పిల్లల్ని కనిపెడుతున్నారని కామెంట్స్ చేస్తారు. కానీ నిజానికి జనాభా పెరగడానికి అసలు కారణం ఇది కాదు. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గడం, మనుషులు ఆయుష్షు పెరగడం జనాభా పెరుగుదలకు కారణమని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ లెక్కలు ఎంత వరకూ నిజమో అనేవి తెలియదు. కానీ గత మన జనాభాతో పోల్చుకుంటే భారత్ జనాభా బాగా పెరిగిందని చెప్పవచ్చు. మరి జనాభా పెరగడానికి కారణమేమిటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.