గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల్లో బీమా పట్ల అభిప్రాయాలు మారాయి. హెల్త్ ఇన్యూరెన్స్ తప్పకుండా చేయించుకుంటున్నారు. కరోనా తర్వాత ఆరోగ్య బీమా ఆవశ్యకత అందరికీ తెలిసొచ్చింది. ఏదున్నా లేకపోయిన మన పేరిట, మన కుటుంబం పేరిట ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలని తెలుసుకున్నారు. అందుకే బీమా కంపెనీలు కూడా పెరిగిపోయాయి. తాజాగా ఈ ఆరోగ్య బీమా లిస్టులోకి పోస్టాఫీస్ కూడా చేరింది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. టాటా ఏఐజీతో కలిసి ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది. వీళ్లు రెండు బీమా పాలసీలను తీసుకొచ్చారు. అయితే మిగిలిన బీమాలతో పోలిస్తే వీళ్ల ప్రీమియం మొత్తం చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి.
రూ.299, రూ.399 ప్రీమియం మొత్తాలతో రెండు యాక్సిడెంటర్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకొచ్చారు. వాటిలో ఒకటి, రెండు మార్పులు తప్ప మిగతావన్నీ దాదాపుగా సేమ్ ఉన్నాయి. అయితే అందరూ ఇది తీసుకునేందుకు వీలు లేదు. ఎవరికైతే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా ఉటుందో వాళ్లు మాత్రమే ఈ యాక్సిడెంటల్ బీమా తీసుకునేందుకు అర్హులుగా చెబుతున్నారు. రూ.399 ప్రీమియం ప్లాన్‌లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.. ట్రీట్మెంట్ టైమ్‌లో ఐపీడీ ఖర్చుల కోసం రూ.60 వేలు అందిస్తారు. ప్రమాదంలో గాయం జరిగితే ఓపీడీ కోసం రూ.30 వేలు, ఒకవేళ ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే.. అంత్యక్రియల కోసం రూ.5 వేలు, పిల్లల చదువు నిమిత్తం రూ.లక్ష అందిస్తారు. రవాణా ఖర్చులు కూడా చెల్లిస్తారు. అదే ఖాతాదారుడికి అంగవైకల్యం కలిగితే రూ.10 లక్షలు పరిహారం అందజేస్తారు.
ఇంక రూ.299 పాలసీ విషయానికి వస్తే.. అతనికి కూడా దాదాపుగా రూ.399 బీమా పాలసీ ప్రయోజనాలే అందుతాయి. కాకపోతే పిల్లల చదువు నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం మాత్రం అందదు. ఈ బీమా పాలసీలకు మంచి రెస్పాన్స్ అందుతోందని చెబుతున్నారు. దాంతో పాలసీ తీసుకునేందుకు ఖాతాదారులు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రూ.299, రూ.399 మాత్రమే కావడంతో పాలసీ కోసం ఎగబడుతున్నారు. ఈ పాలసీలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా, అంగవైకల్యం కలిగినా కూడా రూ.10 లక్షలు అందజేస్తున్నారు. పైగా ఆస్పత్రి ఖర్చులు, పిల్లల చదువులు ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పైగా ఈ యాక్సిడెంటల్ బీమా పాలసీ పాముకాటు, విద్యుదాఘాతానికి కూడా వర్తిస్తుందని ప్రకటించారు. ఈ పాలసీ తీసుకునేందుకు 16 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యనున్న వాళ్లు మాత్రమే అర్హులు. ఇండియా పోస్ట్ యాక్సిడెంటల్ బీమా పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ దగ్గరిలోని పోస్టాఫీసును సంప్రదించండి.