దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనను మరువకముందే అదే తరహా మరో ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. గుజరాత్‌లోని సూరత్‌లో ఓ యువకుడ్ని ఒక వ్యక్తి కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగర్ పాటిల్ (24) అనే వ్యక్తి తన భార్యతో కలసి బైక్ మీద వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన కారు వాళ్లను ఢీకొట్టింది. బైకుపై ఉన్న మహిళ కింద పడిపోగా, కారు కింది భాగంలో సాగర్ చిక్కుకుపోయాడు.
సాగర్ కారు కింద చిక్కుకుపోయినప్పటికీ.. కారు డ్రైవర్ మాత్రం బండిని అలాగే పోనిచ్చాడు. కారు ఆపకుండా దాదాపు 12 కిలోమీటర్లు లాక్కొని వెళ్లాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాగర్ ప్రాణాలు విడిచాడు. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. దారుణమైన ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. వీడియోలో ఉన్న కారును గుర్తించామని తెలిపారు. సాగర్ మృతికి కారణమైన నిందితుడ్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.