ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హానికరం అని తెలిసినా కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వినియోగం అయితే మరీ ఎక్కువ. మిగతా ప్లాస్టిక్ వస్తువుల కంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి నిత్యావసర వస్తువుల్లా మారిపోయాయి. దీంతో ప్రయాణాల్లో ప్లాస్టిక్ బాటిల్ తప్పనిసరి అయిపోయింది. తాగిన తర్వాత వాటిని డస్ట్ బిన్ లో పడేస్తారు. లేదంటే రోడ్డు మీద ఏ చెత్తకుప్పలోనో, లేక రోడ్డు పక్కనో పడేస్తారు. ఇలా రోజుకి కొన్ని కోట్ల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పేరుకుపోతున్నాయి. 2022 ప్లాస్టిక్ బాటిల్స్ వేస్ట్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుకి 10 కోట్ల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వినియోగిస్తున్నారని తేలింది. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలు ఇలా పోగుపడిపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే సంస్థ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. తమ దగ్గరకి ప్లాస్టిక్ బాటిల్ తీసుకొస్తే ఒక్కో బాటిల్ కి 10 రూపాయలు ఇస్తారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్ నాథ్ కి నిత్యం అనేక మంది భక్తులు వెళ్తూ ఉంటారు. నిత్యం రద్దీగా ఉంటుంది. 50 కిలోమీటర్ల దారి పొడవునా దుకాణాల్లో శీతల పానీయాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ గుట్టలు గుట్టలుగా పోగుబడిపోయి ఉన్నాయి. ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలా అని ఒక రీసైకల్ స్టార్టప్ కంపెనీ ఆలోచించింది. అందుకోసం ‘డిజిటల్ డిపాజిట్ రిఫండ్ సిస్టమ్’ అనే సరికొత్త ఆలోచనకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని కోసం రుద్రప్రయాగ్ జిల్లా అధికారులను సంప్రదించారు. డిజిటల్ ఇనిషియేటివ్ లో భాగంగా రీసైకల్ సంస్థ వద్ద డిజిటల్ రిఫండ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. పర్యాటకులు, భక్తులు ఎవరైనా దుకాణాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కూల్ డ్రింక్స్, ప్లాస్టిక్ ఫుడ్ ఐటమ్స్ ఏవైనా ప్లాస్టిక్ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే అదనంగా రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది.
అయితే తాగిన తర్వాత ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ని డిపాజిట్ రిఫండ్ సెంటర్ కి తెచ్చి ఇస్తే.. ఆ పది రూపాయలు యూపీఐ పేమెంట్ చేయడం ద్వారా లేదా డైరెక్ట్ క్యాష్ ద్వారా చెల్లిస్తున్నారు. ఈ పద్ధతిని ఉపయోగించి ఇప్పటి వరకూ లక్షా 63 వేల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని సేకరించారు. ఈ కార్యక్రమం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలను హిమాలయాల సమీపంలో ఉన్న జలాశయాల్లోకి వెళ్లకుండా ఆపగలిగామని వెల్లడించారు. ఈ కార్యక్రమం వల్ల స్థానికంగా ఉండే వారికి, చెత్త ఏరుకునే వారికి కూడా కొంత ఆదాయం సమకూరుతుందని రీసైకల్ సంస్థ ఫౌండర్ మరియు సీఈఓ అభయ్ దేశ్ పాండే వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఈ డిజిటల్ డిపాజిట్ రిఫండ్ సిస్టమ్ కి గుర్తింపు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వినూత్న కార్యక్రమానికి సహకరించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, స్థానిక సంఘాలకి, అసోసియేషన్స్ కి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. డిజిటల్ ఇనిషియేటివ్ ఇన్ కొలాబరేషన్ విత్ స్టార్టప్స్ విభాగంలో డిజిటల్ ఇండియా అవార్డు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో శనివారం నాడు అవార్డు అందుకోనున్నారు. మరి స్టార్టప్ కంపెనీ వినూత్న ఆలోచనపై మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి డిజిటల్ డిపాజిట్ రిఫండ్ సిస్టం సెంటర్ లు దేశమంతా ఉంటే బాగుంటుంది కదా. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
The District Administration has introduced the Digital Deposit Refund system (DRS) on all beverage and food plastic items during Balijatra this year. A QR-Code is applied to these items specifically for this purpose. pic.twitter.com/vPjWWLIFdO
— CMC,Cuttack (@CMCCuttack) November 14, 2022