ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు పాలనా వ్యవహారాలతోపాటు అటు పార్టీ పనులనూ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత సీఎం మీదే ఉంటుంది. వాళ్ల షెడ్యూల్స్ కూడా అలాగే ఉంటాయి. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఊపిరిసలపనంత బిజీగా ఉంటారు. అందుకే ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటే చాలు సాధారణంగా రోడ్లపై మిగిలిన వాహనాలను నిలిపివేస్తారు. సీఎం సమయం వృథా కాకుండా ఉండేందుకు, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా ఆ మార్గంలో వెళ్లే వెహికిల్స్‌ను ఆపేస్తుంటారు. కానీ, ఓ ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం రైళ్లను నిలిపివేయడం మాత్రం కాస్త అరుదనే చెప్పాలి.
బిహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ వెళ్లేందుకు వీలుగా కొన్ని రైళ్లను ఆపేయడం హాట్ టాపిక్‌గా మారింది. బిహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో సమాధాన్ యాత్రలో పాల్గొనేందుకు గానూ నితీష్ కుమార్ బయల్దేరారు. ఇందులో భాగంగా రైలు పట్టాల మీదుగా రోడ్డు మార్గంలో ఆయన కాన్వాయ్ వెళ్లాల్సి ఉంది. దీంతో ఆ లైన్‌లో వెళ్లే రైళ్లను ఆపేశారు. దాదాపు 15 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బక్సర్ స్టేషన్ అవుటర్ సిగ్నల్ దగ్గర రెండు రైళ్లు ఆగిపోయాయి. ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత వాటికి గ్రీన్ సిగ్నల్ పడింది. కానీ అప్పటికే విసుగెత్తిన కొందరు ప్రయాణికులు రైలు దిగి నడుచుకుంటూ, వేరే వాహనాలను ఎక్కి తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ చౌబే స్పందించారు. సీఎం నితీష్ కుమార్ చేపట్టింది సమాధాన్ యాత్ర కాదని.. అది విఘాత యాత్ర అని చౌబే విమర్శించారు. మరి, సీఎం కోసం రైళ్లను ఆపేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.