వాహనాలు మరీ పాతబడితే భూమికి భారం తప్పితే ఇంకేమీ ఉండదు. అందుకే అలాంటి పాడుబడ్డ వాహనాలను రవాణా శాఖ స్క్రాప్ కి వేసేస్తుంటుంది. ఫిట్ నెస్ లేని వాహనాల వల్ల భూమికే కాదు.. మనుషులకు కూడా ప్రమాదమే. అందుకే వాటి రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేస్తుంది. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలకైతే 20 ఏళ్ళు, కమర్షియల్ వాహనాలకైతే 15 ఏళ్ళు దాటితే స్క్రాప్ కి వేసేయాల్సిందిగా రోడ్డు రవాణా శాఖ నిర్ణయించింది. 2021-2022 బడ్జెట్ లో ఫిట్ నెస్ లేని పాత వాహనాలను తుక్కు పరిశ్రమకు తరలించాలని కేంద్రం పేర్కొంది. పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 2021లో స్క్రాపేజ్ పాలసీని ప్రవేశపెట్టింది. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ళు, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ళు దాటితే సామర్థ్య పరీక్షలు తప్పనిసరి అని పేర్కొంది. ఫిట్ నెస్ లేని వాహనాలను స్క్రాప్ కి తరలించాలని నిర్ణయించింది.
ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలు.. 15 ఏళ్ళు దాటితే గనుక అవి ఏప్రిల్ 1 నుంచి స్క్రాప్ కింద పరిగణించనున్నారు. ఆ వాహనాల రిజిస్ట్రేషన్లను ఉపసంహరించనున్నారు. ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని రోడ్డు రవాణా శాఖ, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక రిజిస్ట్రేషన్ చేయించుకుని 15 ఏళ్ళు దాటితే.. ఆ వాహనాలను వదిలేయాలని.. చట్ట ప్రకారం వాటిని తుక్కు పరిశ్రమకు తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏప్రిల్ 1 2022 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. అయితే భారత ఆర్మీ, శాంతి భద్రతలు, అంతర్గత భద్రత వంటి దేశ ప్రయోజనాల కోసం వినియోగించే వాహనాలకు మినహాయింపు ఉంది.
ఈ కొత్త పాలసీ ప్రకారం వాహన యజమానులు తమ పాతబడ్డ వాహనాలను తుక్కు పరిశ్రమకు తరలించిన తర్వాత వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు. యజమానులు కొనుగోలు చేసే కొత్త వాహనాలకు రహదారి పన్నులో 25 శాతం వరకూ రాయితీ ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ఇక ప్రతీ 150 కి.మీ.కు ఒక వాహన తుక్కు కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గత ఏడాది పేర్కొన్న విషయం తెలిసిందే. దక్షిణాసియాలో పాత వాహనాల తుక్కు మార్పిడి కేంద్రంగా భారతదేశం ఎదిగే అవకాశం ఉందని అన్నారు. మరి పాతబడ్డ వాహనాలను, ఫిట్నెస్ లేని వాహనాలను స్క్రాప్ కు తరలించాలనుకున్న కేంద్రం నిర్ణయంపై మీ అభిప్రాయమేమిటి? ఏప్రిల్ 1 నుంచి పాత వాహనాలను స్క్రాప్ వేయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.