అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. ఈ మధ్య కాలంలో కొందరిని లాటరీ టికెట్ల రూపంలో అదృష్టం పలకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జాలర్ల వంతు వచ్చింది. బతుకుదెరువు కోసం సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన జాలర్లను అదృష్టం పలకరించింది. చేపల కోసం వలేస్తే.. ఏకంగా 50 కోట్ల రూపాయల విలువైన సంపద లభించింది. ఇక తమ కష్టాలు తీరిపోయి.. జీవితాలు బాగుపడతాయని జాలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకు వారికి వలలో చిక్కింది ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాంతి. అబ్బో వాంతికి చేసుకున్న పదార్థం దొరకడమేంటి.. దాని విలువ 50 కోట్ల రూపాయలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. మరి అది మామూలు వాంతి కాదు. కోట్ల రూపాయలు విలువ చేసేది. ఆ వివరాలు..
తమిళనాడులోని కల్పాక్కం సమీపంలోని కడపాక్కం గ్రామానికి చెందిన జాలర్లు ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్ ఎప్పటిలానే చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. వల విసిరి చేపల కోసం ఎదురు చూస్తుండగా.. వల బాగా బరువుగా అనిపించింది. ఇక ఈరోజు తమ అదృష్టం బాగుంది.. ఏదో పెద్ద చేపనే వలకు చిక్కింది అనుకున్నారు. సంతోషంగా వలను బయటకు లాగారు. ఇక వలకు చిక్కిన దాన్ని చూసి కళ్లు తేలేశారు.
ఏదో పెద్ద సైజు చేప వలకు చిక్కింది అని భావించిన జాలర్లు.. తీరా.. దానిలో ఉన్న వస్తువును చూసి దిగాలు పడ్డారు. ఆతర్వాత.. వలకు చిక్కిన వస్తువు, దాని విలువ తెలుసుకుని ఆశ్చర్యంతో మూర్ఛపోయినంత పని చేశారు. ఇక జాలర్ల వలకు చిక్కింది అంబర్ గ్రీస్ అంటే తిమింగలం వాంతి అన్నమాట. దానికి కాస్మొటిక్ ప్రపంచంలో ఎంతో విలువ ఉంటుంది. ఇక జాలర్లకు చిక్కింది ఏకంగా 38.6 కిలోల అంబర్ గ్రీస్. దీని విలువ మార్కెట్‌లో 50 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిసింది. దాంతో జాలర్లు.. తెగ సంబరపడుతున్నారు. విషయం తెలియడంతో అటవీశాఖ అధికారులు వచ్చి.. దాన్ని స్వాధీనం చేసుకున్నారు.