ఈ రోజుల్లో ఆడపిల్లల కన్నా మగ పిల్లలకు పెళ్లి కావడం కష్టంగా మారింది. తమ కుమారుడి పెళ్లి విషయంలో కన్నవాళ్లు సైతం దిగులు చెందుతున్నారు. వివాహ వేదికలు, పెళ్లిళ్ల పేరయ్యలను ఆశ్రయించినా ఫలితం ఉండటం లేదు. ఆస్తులు, అంతస్తులు, మంచి ఉద్యోగం ఉన్నా సంబంధాలు రావడం లేదు. కట్నం వద్దనడమే కాదు కదా.. ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటామన్నా ఏ ఆడపిల్ల ముందుకు రాని పరిస్థితి. పట్టణాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దీంతో దేశంలో బ్రహ్మచారులుు పెరిగిపోతున్నారు. సరైన వధువు దొరక్క.. సోలో లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.
అయితే తన జీవితం కూడా బ్రహ్మచారిగా మిగిలిపోతుందనుకున్న ఓ యువకుడు తనకు పెళ్లి కుమార్తెను వెతికి పెట్టాలంటూ ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ చేసి తన బాధను వెళ్లగక్కాడు. మహారాష్ట్ర లోని కన్నాడ్ నియోజక వర్గ శివసేన (ఉద్దవ్ థాకరే మద్దతుదారు) ఎమ్మెల్యే ఉదయ్ సింగ్ రాజ్ పుత్ కు ఈ వింత అను భవం ఎదురైంది. అదే నియోజకవర్గంలోని ఖుల్తాబాద్ కు చెందిన ఓ యువకుడు..తనకు 8 నుండి 9 ఎకరాల పొలం ఉన్నాఎవ్వరూ పిల్లనివ్వడం లేదని, తనకు అమ్మాయిని వెతికి పెట్టమంటూ.. సదరు ఎమ్మెల్యేకు ఫోన్ లో విన్నవించాడు. తొలుత ఖంగుతిన్న ఉదయ్ సింగ్.. తర్వాత అతని బాధను అర్థం చేసుకుని.. అతడికి సరైన వధువును వెతికి పెడతానని హామీనిచ్చారు.
వీరి మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం నెట్టింట్ల చక్కర్లు కొడుతోంది. ఈ ఆడియో కాల్ పై ఉదయ్ సింగ్ ను మీడియా ప్రశ్నించగా.. ఇది వాస్తవమే అని అంగీకరించారు. ఇటీవల తనకు ఇటువంటి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి కాని మగ పిల్లల సంఖ్య పెరుగుతోందని .. ఆస్తులు, ఎకరాల కొద్దీ భూములున్నాపిల్లనిచ్చేందుకు ఆడ పిల్లల తల్లిదండ్రులు మొగ్గు చూపడం లేదని అన్నారు. సిటీలో స్థిర పడ్డ అబ్బాయిలకు ఆడపిల్లనిచ్చేందుకు వారు ఆస్తకి చూపుతున్నారన్నారు.