ఒక్కోసారి ఏ తప్పూ చేయని వాళ్ళు కూడా జైల్లో శిక్షలు అనుభవిస్తారు. సినిమాల్లో చూపించినట్టు ఒత్తిడి తట్టుకోలేక పోలీసులు, అధికారులు కలిసి ఆ కేసుల్లో సంబంధం లేని వ్యక్తులని ఇరికిస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒక వ్యక్తి జీవితంలో చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఒక సామూహిక అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. రెండేళ్లు తర్వాత అతను నిర్దోషి అంటూ కోర్టు విడుదల చేసింది. ఈ రెండేళ్లలో తన జీవితాన్ని కోల్పోయినందుకు నష్టపరిహారంగా 10 వేల 6 కోట్ల 2 లక్షల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్ వేశాడు. తప్పుడు కేసులో ఇరికించి.. శిక్ష పడేలా చేయడం వల్ల రెండేళ్లు.. భార్యతో లైంగిక సుఖాన్ని పొందలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ లోని రాత్లాం జిల్లాకి చెందిన కాంతూ అలియాస్ కాంతిలాల్ భీల్ (35) ఒక గిరిజన వ్యక్తి. సామూహిక అత్యాచారం కేసులో రెండేళ్ల క్రితం అరెస్ట్ అయ్యాడు. గత అక్టోబర్ లో ఈ కేసుతో అతనికి సంబంధం లేదని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో ఆ వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం మీద పరువు నష్టం దావా వేశాడు. తప్పుడు కేసు పెట్టి అన్యాయంగా 666 రోజులు జైలు శిక్ష పడేలా చేసినందుకు.. తన కుటుంబం అనుభవించిన మానసిక వేదనకు, ఇతర కారణాలకు, పిటిషన్ ఖర్చులకు అన్నీ కలిపి 10 వేల 6 కోట్ల 2 లక్షల రూపాయలు తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. భగవంతుడు బహుమతిగా ఇచ్చిన లైంగిక సుఖాన్ని కోల్పోయేలా చేసినందుకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశాడు.
రెండేళ్లు జైల్లో అనుభవించిన నరకాన్ని మాటల్లో చెప్పలేనని, తన కుటుంబ సభ్యులకి తనకు కనీసం ఒక డ్రాయర్ కూడా కొనే స్థోమత లేదని, జైల్లో బట్టలు లేక అతి వేడి, అతి చలి తట్టుకోలేక బిక్కుబిక్కుమంటూ బతికానని వెల్లడించాడు. కాంతూ తరపు పిటిషనర్ మాట్లాడుతూ. ‘అతను ఇప్పటికీ జైలులో అనుభవించిన కష్టాలను అనుభవిస్తున్నాడు. నేరారోపణ, జైలు జీవితం అతని ప్రపంచాన్ని తలకిందులు చేసింది. భార్య, పిల్లలు, అతని తల్లి ఎంతో వేదనకు గురయ్యారు’ అని అన్నారు. మరి ఒక తప్పుడు కేసులో అమాయకుడైన కాంతూని ఇరికించి.. రెండేళ్ల జైలు శిక్షకి కారణం అయిన వారిని ఏం చేయాలి? సరైన ఆధారాలు లేకుండా అమాయకుడ్ని శిక్షించి.. నిర్దోషిగా విడుదల చేస్తే అతను కోల్పోయిన జీవితం వెనక్కి వస్తుందా? ఈ విషయంలో ప్రభుత్వంపై అతను 10 వేల 6 కోట్ల పరువు నష్టం వేయడాన్ని మీరు సమర్థిస్తారా? ఇలాంటి సంఘటనల్లో అతని జీవితం నాశనం అవ్వడానికి కారణమైన వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.