అమ్మతనం.. ప్రతీ స్త్రీ కోరుకునే ఓ గొప్ప అనుభూతి. అందుకే అమ్మా అనే పిలుపుకై ఆరాటిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది దంపతులు అమ్మా అనే పిలుపునకు నోచుకోలేక పోతున్నారు. దాంతో వారి బాధ వర్ణాణాతీతంగా మారుతోంది. సమాజంలో ఆస్తి, అంతస్తులతో పాటు పిల్లలు ఉండటం కూడా ఓ గౌరవంగా భావిస్తారు. ఇలాంటి సమయంలో ఓ వృద్ధ జంట మాత్రం పిల్లలు లేని దంపతులకు ధైర్యాన్ని ఇచ్చే ఒక వార్తను తెలియజేశారు. ఆ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ లోని నుహానియా గ్రామానికి చెందిన గోపీచంద్-చంద్రావతి భార్య భర్తలు. ప్రస్తుతం గోపీచంద్ వయసు 75 సంవత్సరాలు, చంద్రావతి వయసు 70ఏళ్లు. వారికి వివాహం అయ్యి 54 సంవత్సరాలు అయ్యింది. అయినప్పటికీ వారికి ఇంకా పిల్లలు కలగలేదు. ఈ క్రమంలో వారు పిల్లల కోసం తిరగని గుడీలేదు.. వెల్లని ఆసుపత్రీ లేదు. అయినప్పటికీ వారికి ఫలితం దక్కలేదు. ఇక వారికి అమ్మా.. నాన్నా అని పిలిపించుకునే భాగ్యం లేదనుకున్నారు అంతా..
చివరి ప్రయత్నంగా IVF డాక్టర్ పంకజ్ గుప్తాను గోపీచంద్ దంపతులు ఆశ్రయించారు. ఆయన వారికి చికిత్స అందించారు. ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా చంద్రావతి పండంటి మగ బిడ్డకు తాజాగా జన్మనిచ్చింది. దీంతో 54 ఏళ్ల నిరీక్షణ తర్వాత వారి కల ఫలించింది. ఈ విషయమై డాక్టర్ పంకజ్ గుప్తా స్పందిస్తూ.. ”ఈ వయసులో పిల్లలు పుట్టిన సందర్భాలు చాలా తక్కువ. అదీకాక రాజస్థాన్ లో ఇదే మెుదటి కేసు కావొచ్చు. బేబి బరువు సుమారు 3.5 కేజీలు ఉందని” పంకజ్ గుప్తా తెలిపారు.
ఇప్పుడు మేం కూడా మిగిలిన వారితో సమానం అయ్యాం. మా వంశం కూడా ఎదిగింది. నాకు ఆనందంతో మాటలు రావడం లేదు. అని గోపీచంద్ అన్నారు. అమ్మా నాన్నా అని పిలిపించుకోవడం ఓ వరం. దానికి కోసం వారు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు.. సమాజం నుంచి చీత్కారాలను సైతం వారు ఎదుర్కొన్నారు. ఎంతో మంది మీకు పిల్లలు పుట్టరు అని ఎగతాళి చేశారు. వాటన్నింటిని దాటి వచ్చారు. ఆధునిక వైద్య రంగంలో అన్నింటిని సృష్టించ వచ్చని మరోసారి రుజువు చేశారు. మరి వయసులో అమ్మ అయిన ఆమె మనో గతంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.