ప్రతీ బిల్డింగ్ కి చిన్న చిన్న బీటలు పడడం అనేది మామూలే. అయితే ఆ బీటలు మరీ ఎక్కువైతే బిల్డింగ్ అమాంతం కూలిపోతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇదే జరిగింది. ఉన్నట్టుండి నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. సినిమాల్లో బాంబ్ వేస్తే కూలినట్టు, జేసీబీలతో పడగొట్టినట్టు.. బిల్డింగ్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా కూలిపోయింది. లైవ్ లో అందరూ చూస్తుండగా నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. కొంతమంది భవనం కూలడం దగ్గర నుంచి చూశారు. బీటలు పడి.. కూలిపోవడానికి సిద్ధంగా ఉందని తెలుసుకుని జనాలు అక్కడ నుంచి పరుగులు పెట్టారు. కళ్ళ ముందే భవనం కూలిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. కూలిన బిల్డింగ్ ఎక్కువ భాగం.. విద్యుత్ తీగలపై పడడంతో పొగలు వ్యాపించాయి.
దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటన ఢిల్లీలోని శాస్త్రి నగర్ లో చోటు చేసుకుంది. 4 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్, అంబులెన్స్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఘటన జరిగిన సమయంలో ఇల్లు ఖాళీగానే ఉందని, ఎప్పటి నుంచో ఖాళీగానే ఉంటుందని స్థానికులు తెలిపారు. అయితే బిల్డింగ్ కి బీటలు పడడం వల్లే ఇలా జరిగిందా? లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
#WATCH | दिल्ली में चार मंजिला बिल्डिंग अचानक भरभरा कर गिरी pic.twitter.com/VLvfG7qzNd
— NDTV India (@ndtvindia) December 5, 2022