పిల్లలు పుట్టలేదని కొంత మంది ఏడుస్తున్నారు. ఒక బిడ్డ పుట్టినా చాలు రా బాబూ అని దేవుళ్లకు మొక్కుతూ, డాక్టర్లకు వేలకు వేలు పోస్తున్నారు. అయినప్పటికీ కొంత మందికి పిల్లలు కలగడం లేదు. కానీ మనం ఇప్పుడు చెప్పుకునే ప్రబుద్దులు మాత్రం ఉద్యోగం కోసం కన్న బిడ్డనే కడతేర్చారు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలోని చందాసర్ గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే చందాసర్ గ్రామ వాసి జన్వర్ లాల్ మఘ్వాల్, అతడి భార్య గీత. వీరికి 4వ సంతానంగా మూడు నెలల క్రితం ఆడపిల్ల జన్మించింది. జన్వర్ లాల్ ఓ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రాజస్థాన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఉండదు. కాగా, త్వరలో తన ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని జన్వర్ లాల్ భావించాడు. గతంలో సమర్పించిన అఫిడవిట్ లో తనకు ఇద్దరు పిల్లలే అని పేర్కొన్నాడు. అయితే తనకు నలుగురు పిల్లలు ఉండటంతో.. ఉద్యోగానికి ఎసరు వచ్చే అవకాశం ఉందని భావించి.. 8 ఏళ్ల కుమార్తెను తన తమ్ముడికి దత్తత ఇచ్చాడు.
ఇలా ఉండగా.. వారికి మూడు నెలల క్రితం కుమార్తె జన్మించింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఉద్యోగం ఊడిపోతుందని భావించిన దంపతులు.. ఆ బిడ్డను చంపేయాలని దారుణ నిర్ణయం తీసుకున్నారు. గత ఆదివారం పాపను తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో ఇందిరా గాంధీ కెనాల్ ప్రాంతంలోని పై వంతెనపై వద్ద ఆగి, చిన్నారిని నీళ్లలోకి పడేశారు. ఇది చూసిన అక్కడి ప్రజలు కేకలు వేయగా.. భార్యా భర్తలిద్దరూ బండిపై పరారయ్యారు. పాపను రక్షించేందుకు అక్కడి ప్రజలు నీటిలోకి దూకి చిన్నారిని బయటకు తీయగా.. అప్పటికే చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు భార్యాభర్తలను అరెస్టు చేసి జైలుకు తరలించారు.