పెళ్లి అయి నెల రోజుల కూడా గడవలేదు అప్పుడే ఆ మహిళ సంతలో పశువుల అమ్ముడుపోయింది. నమ్ముకున్న భర్త తనను ఇలా తెగనమ్ముతాడని ఆమె ఊహించలేదు. 55 ఏళ్ల వయసున్న ఒక ఇటుక బట్టీ యజమానికి ఆమె బానిసగా మారింది. చివరకు పోలీసుల సాయంతో అతడి చేరనుంచి బయటపడింది. ఒడిశా బలంగీర్ జిల్లాలోని బెల్పాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ యువకుడు.. 26 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడు. నెల కాకముందే.. మహిళను మధ్యప్రదేశ్ సరిహద్దులోని రాజస్థాన్ బారన్ జిల్లాలోని ఓ గ్రామానికి ఇటుక బట్టీ పనుల కోసం తీసుకెళ్లాడు.
ఇటుక బట్టీలో పనికి కుదిరిన అనంతరం బట్టీ యజమాని 55 ఏళ్ల వ్యక్తికి భార్యను విక్రయించాడు. అనంతరం స్మార్ట్ ఫోన్ కొని యువకుడు ఒడిశాలోని ఇంటికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు ప్రశ్నించగా.. తన భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందని తెలిపాడు. అనుమానం వచ్చిన మహిళ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. భార్యను అమ్మినట్లు రికార్డింగులు ఉన్నాయి. వెంటనే పోలీసులు యువకుడిని తమదైన స్టైల్లో ప్రశ్నించగా.. వివరాలన్నీ చెప్పాడని పోలీసులు తెలిపారు. భార్యను రూ.లక్షకు అమ్మి సెల్ ఫొన్ కొన్నట్లు చెప్పాడని తెలిపారు.
జూలైలో పెళ్లి జరిగిన అనంతరం.. ఆగస్టులో ఈ జంట ఇటుక బట్టీలో పని చేయడానికి వెళ్లింది. బరాన్ జిల్లాకు చెందిన ఇటుక బట్టీ యజమానికి 1.8 లక్షలకు విక్రయించాడని బలంగీర్ జిల్లా బెల్పాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బులు ముండా తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు అనంతరం అతి కష్టం మీద మహిళను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి 17 ఏళ్ల యువకుడిని శుక్రవారం జువైనల్ కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
