మహిళలు, విద్యార్థినుల కోసం పలు రాష్ట్రాలు ప్రత్యేక బస్సులను నడుపుతుంటాయి. మహిళలు సాధికారిత వైపుగా అడుగులు వేసేందుకు తోడ్పాటునందిస్తాయి. కొన్ని సార్లు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు రవాణా సౌకర్యాల్లో రాయితీలు కల్పిస్తుంటాయి ప్రభుత్వాలు. వచ్చే నెల నుండి మహిళలు, విద్యార్థినులు ఉచిత ప్రయాణం అందించే అవకాశం కల్పించింది ఈ ఏడాది ఎన్నికల బరిలో దిగుతున్న కర్ణాటక ప్రభుత్వం, తాజాగా మరో ప్రభుత్వం మహిళల కోసం రాయితీలను ప్రకటించింది.
కాలేజీలు, ఉద్యోగాలకు ఎక్కువగా బస్సులు, రైళ్లను వినియోగిస్తుంటారు ప్రజలు. రైళ్ల ప్రయాణం కొంత వ్యయ, ప్రయాసలతో కూడుకున్నదీ కావడంతో మహిళలు, విద్యార్థులు ఎక్కువగా బస్సుల్లోనే గమ్య స్థానాలకు చేరుకుంటారు. మహిళలు, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు రాయితీలు, సబ్సడీలు ప్రకటిస్తుంటాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలయితే మహిళల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతుంటాయి. మహిళా సాధికారికత కోసం తోడ్పాటు అందిస్తుంటాయి. కర్ణాటకలో వచ్చే నెల మొదటి నుండి విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించవచ్చునని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు. ఇప్పుడు మరో ఆర్టీసీ తమ మహిళా ప్రయాణీకులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఆ ఉప ముఖ్యమంత్రి ఇటీవల అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.
ఇంతకు ఆ రాష్ట్రమేమిటంటే మహారాష్ట్ర. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని రకాల బస్సులలో మహిళా ప్రయాణీకులకు టికెట్ పై 50 శాతం రాయితీ ఇస్తున్నామని స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) సంస్థ ప్రకటించింది. నేటి నుండే అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ప్రతికా ప్రకటన చేసింది. మహిళా సమ్మాన్ యోజన్ కింద మహిళలకు అందిస్తున్న ఈ ప్రయోజనం పొడిగించబడుతుందని పేర్కొంది. బస్సు టికెట్స్ లో రాయితీ ఇస్తున్నందనున ఆ రాయితీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం .. ఆర్టీసీ కార్పొరేషన్‌కు తిరిగి చెల్లిస్తుందని పేర్కొంది. ఆర్ధిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి.. దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టే సమయంలో మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దాన్ని ఇప్పుడు అమలు చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లో 15,000 బస్సులు, ఫెర్రీల్లో రోజుకు 50 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అయితే రాష్ట్ర ట్రాన్స్ పోర్టు కొన్ని సామాజిక గ్రూప్స్‌కి చెందిన టిక్కెట్లపై 33% నుండి 100% వరకు తగ్గింపులను అందిస్తుంది. ఇప్పడు ప్రభుత్వం స్త్రీలకు టికెట్స్ లో రాయితీ ఇస్తున్న విషయంపై ఎంఎస్ఆర్టీసీ అధికారులు స్పందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందే మహిళల సంఖ్యను అంచనా వేయలేమని తెలిపారు. మహిళా ప్రయాణీకుల్లో నివాసితుల సంఖ్య .. రవాణా వినియోగదారుల్లో 35-40 శాతం పరిధిలో ఉంటుందని ఎంఎస్ఆర్టీసీ అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు 100 శాతం రాయితీని.. 65 మరియు 74 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రయాణికులకు అన్ని ఎంఎస్ఆర్టీసీ బస్సులపై 50 శాతం తగ్గింపును అందించిన సంగతి తెలిసిందే.