స్పోర్స్ట్ డెస్క్- ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 వేలానికి సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2022 మెగావేలం ఫిబ్రవరి 7,8 తేదీల్లో జరగనున్నట్లు సమాచారం. ఈ సారి ఐపీఎల్ మెగా వేలం బెంగళూరు వేదికగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని బీసీసీఐ అధికారి అనధికారికంగా మీడియాకు తెలియజేశాడు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపధ్యంలో ఈసారి ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని రెండు రోజుల పాటు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందట. ఐతే ఎప్పుడు ముంబై వేదికగా జరిగే ఐపీఎల్ వేలం కార్యక్రమం ఈసారి మాత్రం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో నిర్వహించాలని బీసీసీఐ గత కొన్ని రోజులుగా భావిస్తూవస్తోంది.
ఈ క్రమంలోనే ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కౌన్సిల్ ఐపీఎల్ మెగా వేలానికి బెంగళూరు సిటీని ఫైనలైజ్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి వచ్చే సంవత్సరం జనవరిలోనే వేలం జరగాల్సి ఉంది. ఐతే అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన సమస్య ఒకటి పరిష్కారం కాకపోవడంతో వేలాన్ని ఫిబ్రవరికి వాయిదా వేశారు.
నూతన జట్లు అహ్మదాబాద్, లక్నోకు సంబంధించి ఆటగాళ్ల ఎంపికకు డెడ్ లైన్‌ను కూడా బీసీసీఐ పొడిగించింది. ఇక ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలుగా అడుగుపెడుతున్న అహ్మదాబాద్‌కు శ్రేయాస్ అయ్యర్, లక్నో ఫ్రాంచైజీకి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయట. మొత్తానికి ఐపీఎల్ 2022 మెగా వేలం ఖరారవ్వడంతో క్రికెట్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.