ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక రియల్ హీరో ఉంటాడు. అతని పేరు ఏదైనా గానీ సర్వనామం మాత్రం ఒకటే, అదే తండ్రి. తండ్రి అనేది ఒక ఎమోషన్. చిన్నప్పుడు నడక నేర్పి.. ఎదిగాక నడవడిక నేర్పి.. అందమైన భవిష్యత్తుని ఇచ్చే గొప్ప గురువు తండ్రి. అయితే కొంతమందికి తండ్రితో గడిపే ఆనంద క్షణాలు ఉండవు. బాల్యంలో ఉండగా తమని వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతే ఆ పిల్లలు పడే బాధ మాటల్లో చెప్పలేనిది. నాన్న గుర్తులు ఏవైనా ఉంటే బాగుణ్ణు అని అనుకుంటారు. ప్రపంచంలో ఎక్కడైనా నాన్నకి సంబంధించిన గుర్తులు ఉంటే పిల్లలు ఎంత కష్టమైనా సరే ఆ దేశం కాని దేశానికి వెళ్లి కడసారిగా నాన్న జ్ఞాపకాన్ని తనివితీరా చూసుకుంటారు. అలాంటి వారిలో తమిళనాడుకి చెందిన తిరుమారన్ ఒకరు.
తన తండ్రి సమాధి కోసం ఏకంగా మలేషియా వెళ్ళాడు. తండ్రి బతికుండగా తండ్రి ఇంటికే వెళ్లని కొడుకులున్న నేటి సమాజంలో ఎప్పుడో 55 ఏళ్ల క్రితం మరణించిన తండ్రి సమాధి కోసం.. దేశం కాని దేశం వెళ్లడం అంటే చిన్న విషయం కాదు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వెంకడంపట్టి గ్రామానికి చెందిన తిరుమారన్ (56) అనే వ్యక్తికి తన తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. ఆయనకి ఆరు నెలల వయసున్నప్పుడే తండ్రి కె. రామ సుందరం అలియాస్ పూంగుంట్రాన్ మరణించారు. తిరుమారన్ పుట్టేనాటికి కుటుంబం మలేషియాలో నివసించేది. మలేషియాలోని ఓ పాఠశాలలో టీచర్ గా పని చేసేవారు రామ సుందరం. 1967లో అనారోగ్యం కారణంగా మరణించారు. దీంతో భర్త మృతదేహాన్ని మలేషియాలో ఒక సమాధిలో పాతిపెట్టి భారత్ కి వచ్చేసింది తిరుమారన్ తల్లి రాధాబాయి.
అయితే ఈమె కూడా మరణించింది. ఈమె మరణించి 35 ఏళ్ళు అయ్యింది. అయితే తిరుమారన్ కి తన తండ్రి సమాధిని వెతికి పట్టుకోవాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేది. మలేషియాలోని కెర్లింగ్ లో.. కెర్లింగ్ తొట్టా థెసియా వాకై తమిళ్ పల్లి అనే పాఠశాలలో తన తండ్రి పని చేసేవారని తిరుమారన్ తెలుసుకున్నారు. ఈ ఒక్క ఆధారం తప్ప వేరే ఏ ఆధారాలు లేవు. ఆ స్కూల్ పేరుని గూగుల్ లో సెర్చ్ చేస్తే.. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చిదంబరం ఈమెయిల్ అడ్రస్ దొరికింది. మెయిల్ ద్వారా ప్రిన్సిపాల్ ని సంప్రదిస్తే.. అప్పటి ఓల్డ్ స్టూడెంట్స్ మోహనరావు, నాగప్పన్ ల వివరాలు ఇచ్చారు. ఆ వివరాలతో వారిని సంప్రదించి.. విషయం చెప్పగా.. కెర్లింగ్ లో ఉన్న రామ సుందరం సమాధిని గుర్తించి తిరుమారన్ కి సమాచారం ఇచ్చారు.
ఈ నవంబర్ 8న మలేషియాకి వెళ్లి.. కెర్లింగ్ లోని పొదల్లో దాగి ఉన్న తండ్రి సమాధిని చూశారు తిరుమారన్. సమాధి బాగా పాతబడినప్పటికీ.. ఫలకం మీద ఉన్న పేరు, జనన మరణ తేదీలు, ఫోటో కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. తండ్రి ఫోటో చూసి భావోద్వేగానికి గురయ్యారు తిరుమారన్. తన తండ్రి ఎలా ఉంటాడో అని 55 ఏళ్ల తర్వాత తెలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు తిరుమారన్. సమాధిని గుర్తించడంలో సహాయపడిన నాగప్పన్, ఇతర ఓల్డ్ స్టూడెంట్స్ రామ సుందరం మాష్టారి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమకి పాఠాలు నేర్పిన రామ సుందరం మాష్టారు వల్లే తాము ఈ స్థితిలో ఉన్నామని పాత విద్యార్థులు అన్నారు. మొత్తానికి తండ్రి సమాధిని పట్టుకోవాలన్న తిరుమారన్ కల నెరవేరడమే గాక తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలిసింది. కాగా ఈ జ్ఞాపకాలన్నిటినీ నెమరువేసుకుంటూ నవంబర్ 16న తిరిగి భారత్ కి వచ్చారు తిరుమారన్.
மனிதன் உணர்ச்சிக் குவியல்களால் ஆனவன். அன்பின் தேடலில்தான் வாழ்நாளெல்லாம் நம் வாழ்வின் பயணம் அமைகிறது.
தென்காசியின் வேங்கடம்பட்டியைச் சேர்ந்த திரு. திருமாறன் அவர்கள், தனது தந்தை திரு. இராமசுந்தரம் அவர்களின் நினைவிடத்தைத் தேடி மலேசியாவுக்கு மேற்கொண்ட பயணம்… (1/4) pic.twitter.com/WN0mEfTv2D
— M.K.Stalin (@mkstalin) November 22, 2022