'స్వలింగ సంపర్కుల వివాహాలు..' ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు వివాహబంధంతో ఒక్కటవ్వడం. ప్రాచీన కాలంలో ఇలాంటివి ఎన్నడూ వినపకపోయినా, ఆధునిక కాలంలో వీటి ఉనికి బాగానే ఉంది. మొదట పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ఈ సంస్కృతి మెల్లమెల్లగా భారతదేశంలోనూ తిష్టవేసింది. ఎందరో అబ్బాయిలు, అమ్మాయిలు దాంపత్య జీవితంతో ఒక్కటయ్యారు. పిల్లలను కన్నారు. వీరి నిర్ణయాన్ని సమాజం సైతం అంగీకరించింది. అయితే, తమ వివాహాలను చట్టబద్దంగా గుర్తించాలంటూ వారు సుప్రీం కోర్టుకు వెళ్లడం.. కేంద్రం తన వైఖరి తెలియజేయడం వివాదానికి దారి తీసేలా ఉంది.
స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీం కోర్టులో వాడీ వేడీ చర్చ జరిగింది. స్వలింగ వివాహాలను అధికారికంగా గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం తన వాదనలు వినిపించింది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం, లైంగిక సంబంధాలు కలిగి ఉండటం నేరం కాకపోయినప్పటికీ.. భార్యాభర్తల బంధానికి, భారతీయ సంస్కృతికి ఇది విరుద్ధమని స్పష్టం చేసింది. స్త్రీ, పురుషుల కలయిక ద్వారా జన్మించిన పిల్లలు భవిష్యత్తులో మరికొందరు పిల్లలకు తల్లిదండ్రులుగా మారతారని, స్వలింగ సంపర్కులతో ఇది ఎలా సాధ్యమవుతోందని ప్రశ్నించింది.
స్వలింగ సంపర్కుల వివాహాలు భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని తేల్చి చెప్పింది కేంద్రం. ఎన్నో సంస్కృతులకు, మతాలకు నిలయమైన భారత్‌లో ఆయా మతాల వారీగా వివాహ చట్టాల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయని.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే.. వారు ప్రస్తుత వివాహ చట్టంలోని కొన్ని నిబంధలను ఉల్లంఘించే అవకాశం ఉందని తన వాదనను వినిపించింది. స్త్రీ, పురుషులను ఒకటిగా చేయడమే వివాహం ముఖ్య ఉద్దేశమన్న కేంద్రం.. సామాజికంగా, సాంస్కృతికంగా, చట్టబద్ధంగా ఇదే వివాహం యొక్క అంతర్గత అర్థమని కోర్టుకు తెలిపింది. ఒక లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవడడాన్ని తప్పుపట్టలేనప్పటికీ.. దానికి చట్టబద్ధత కల్పించి ప్రజల నమ్మకాలను, ఆచార వ్యవహారాలకు భంగం కలిగించకూడదని తెలిపింది.
కేంద్రం మాటల్లో.. “సంప్రదాయబద్ధంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన స్త్రీ- పురుషులు ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వారికి కొన్ని విలువలు, సామాజిక బాధ్యతలు, హక్కులు ఉంటాయి. కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వివాహానికి చట్టపరమైన గుర్తింపు కంటే.. సామాజిక గుర్తింపే అసలైనది. తద్వారా వాళ్లకు నియంత్రణ ఉంటుంది. స్వలింగ వివాహాల విషయంలో ఇది ఉండకపోవచ్చు. ఒకే లింగానికి చెందిన వ్యక్తుల వివాహాన్ని గుర్తిస్తే కుటుంబ సమస్యలు కూడా ఎక్కువవుతాయి..” అని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. కాగా, ఇటీవల కాలంలో నాలుగు స్వలింగ సంపర్క జంటలు తమ వివాహాలను చట్టబద్దంగా గుర్తించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తన వివరణ తెలపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలోనే కేంద్రం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Central Govt opposes plea seeking recognition of same sex marriage before the #SupremeCourtOfIndia
Center Says same sex relation “cannot be compared to the Indian family concept of a husband, a wife and children born out of the union.” #Samesexmarriage #SupremeCourt pic.twitter.com/owBkyc2F8M
— Ashwani Dubey (@ashwani_dube) March 12, 2023