హైదరాబాద్- దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోను లాక్ డౌన్ అమల్లో ఉంది. కేవలం కొన్ని గంటలు మాత్రమే లాక్ డౌన్ కు సడలింపులు ఇవ్వడంతో జనం వారికేం కావాలన్నా ఆ సమయంలో మాత్రమే బయటకు వస్తున్నారు. ఇక మరి కొంత మంది ఐతే అవసరం ఉన్నా, లేకున్నా లాక్ డౌన్ సమయంలో విచ్చల విడిగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో అలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా, అనుమతి లేనిదే రోడ్లపైకి వచ్చే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, భారీగా ఫైన్లు వేస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ కొందర ఏ మాత్రం బెదరడం లేదు. అకారణంగా రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో కొత్తగా పెళ్లైన జంట లాక్ డౌన్ సమయంలో రోడ్డుపైకి వచ్చి పోలీసులకు చుక్కలు చూపించింది.
వాళ్లిద్దరు రోడ్డుపైకి వచ్చిందే కాక, వారితో పాటు ఓ కుక్క పిల్లను కూడా తీసుకువచ్చిందా జంట. అసలేం జరిగిదంటే.. మధాపూర్ లో నివాసం ఉండే ఓ జంటకు ఇటీవలే కొత్తగా పెళ్లైంది. పెళ్లైన వెంటనే తెలంగాణలో లాక్ డౌన్ పెట్టేశారు. దీంతో వారు చాలా రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఎటూ పాలుపోక అలా సరదాగా బైక్ పై తిరగాలన్న కోరికతో ఇద్దరు బైక్ వేసుకుని రోడ్డుపైకి వచ్చారు. మద్యాహ్నం సమయం కావడం, లాక్ డౌన్ అమల్లో ఉండటంతో వారిని పోలీసులు ఆపి ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. వారితో పాటు ఓ చిన్న కుక్క పిల్ల కూడా ఉండటంతో, తమ కుక్క పిల్లకు జ్వరం వచ్చిందని, ఆస్పత్రికి వెళ్తున్నామని చెప్పారు.
ఐతే లాక్ డౌన్ సమయంలో పెట్ హాస్పిటల్స్ మూసి ఉన్నాయని తేల్చిన పోలీసులు.. ఎక్కడికి వెళ్తున్నారో నిజం చెప్పాలని దబాయించారు. దీంతో ఆ కొత్త జంట అసలు విషయం చెప్పేసింది. ఏదేంటంటే.. వాళ్లిద్దరికి పెళ్లై కేవలం 15 రోజులే అయ్యిందట. లాక్ డౌన్ ఉండటంతో పెళ్లైనప్పటి నుంచి ఇంట్లో ఉండి ఉండీ బోర్ కొట్టేసింది.. అందుకే అలా సరదాగా బైక్ పై షికారుకు వచ్చామని చెప్పేశారు. దీంతో కొత్తగా పెళ్లైన జంట హాయిగా ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయాలి గాని, ఇలా లాక్ డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చి కాదు అని హెచ్చరించి పంపించేశారు పోలీసులు. దీంతో చేసేది లేక మెల్లగా బండి వెనక్కి తిప్పుకుని ఇంటికి వెళ్లిపోయిందా జంట.