బెంగళూరు- వాళ్లిద్దరు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ విధికి ఆ నవ జంటపై అప్పుడే కన్నుకుట్టింది. పెళ్లయిన 24 గంటల్లోపే పెళ్లి కొడుకు చనిపోగా, పెళ్లి కూతురు కోమాలోకి వెళ్లింది. ఈ హృదయ విషాధకరమైన ఘటన బెంగళూరు దగ్గర చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడికి చెన్నైకి చెందిన కనిమొళితో తిరుపతిలో వివాహం జరిగింది. పెళ్లి బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహం అనంతరం అత్తవారింటికి చెన్నై వెళ్తున్న సమయంలో బెంగళూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిద్దరిని ఆసుప్రతికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పెళ్లి కొడుకు శ్రీనివాస్ చనిపోయాడు. మరోవైపు పెళ్లి కూతురు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో వరుడే కారు నడిపినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు, బంధువులతో ఎంతో సందడిగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయులు అలుముకున్నాయి.
పెళ్లి జరిగిన 24 గంటల్లోపే వరుడు శ్రీనివాస్ చనిపోవడంతో శేరిలింగంపల్లిలోని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న కాసేపటికే ఇలా విషాధ ఘటన జరగడం ఏంటని రోధిస్తున్నారు. పెళ్లి కూతురు కనిమొళి పరిస్థితి సైతం విషయమంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.