కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిషీల్డ్ ఫస్ట్, సెకండ్ డోసుల మధ్య గ్యాప్ ను 12 నుంచి 16 వారాలకు పెంచుతున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ఇంతకుముందు కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య ఆరు నుంచి ఎనిమిది వారాలుగా ఉండేది. ఈ మార్పులకు వీకే పాల్ నేతృత్వంలోని నేషనల్ అడ్వైజరీ కమిటీ ఆన్ వాక్సిన్స్ ఆమోదముద్ర వేసింది. అయితే కొవ్యాక్సిన్ డోసుల గ్యాప్ విషయంలో మాత్రం పాత పద్ధతికే కట్టుబడి ఉంటామని కేంద్రం స్పష్టం చేసింది. కొవ్యాక్సిన్ డోసుల మధ్య నాలుగు నుంచి ఆరు వారాల అంతరం ఉంది. ఇండియాలో వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు అమెరికాకు చెందిన వైట్‌హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ.
క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే సాధ్యమైనంత త్వరగా ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేసే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా చూస్తే ఇది మంచి నిర్ణయమే. వ్యాక్సిన్ల ఉత్పత్త సామర్థ్యాన్ని పెంచుకుంటూనే ఇతర దేశాలు, కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి అని ఫౌచీ సూచించారు. అయితే వ్యాక్సిన్ల కొరత కారణంగానే కొవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచుతూ అది టీకా సామర్థ్యాన్ని పెంచుతుందన్న ప్రచారం ప్రభుత్వం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ విమర్శ సరైనది కాదని ఫౌచీ అభిప్రాయపడ్డారు. రెండు డోసుల మధ్య గ్యాప్ ఈ స్థాయిలో పెంచడం వల్ల అది టీకా సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం కూడా ఏమీ చూపదని అన్నారు. వచ్చే వారమే స్పుత్నిక్ వి మార్కెట్‌లోకి రానుంది. స్పుత్నిక్ వి సామర్థ్యం బాగానే ఉన్నదని ఈ సందర్భంగా ఫౌచీ చెప్పారు. ఇక ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఏ దేశమైనా మిలిటరీని ఉపయోగించడం ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధ సమయంలోలాగే వారితో ఫీల్డ్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయించవచ్చని చెప్పారు.