విశ్వాసం చూపే జంతువు ప్రాణాలు తీస్తోంది. నగరాల్లో, గ్రామాల్లో వీధి కుక్కులు స్వైర విహారం చేస్తూ మనుషులపై దాడికి పాల్పడుతున్నాయి. రోడ్డుపై నడుస్తున్నా, బైక్ పై వెళ్తున్న వారిపై కూడా ఎగబడుతున్నాయి. వీటి వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వీధి కుక్కులు అభం శుభం తెలియని నాలుగేళ్ల పసిబాలుడ్ని పొట్టనపెట్టుకున్నాయి.
ఇటీవల నగరాల్లో, గ్రామాల్లో వీధి కుక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై నడుస్తున్న వారిపైనే కాకుండా బైక్ లపై వెళ్తున్న వారిపై కూడా ఎగబడుతున్నాయి. వీటి వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వీధి కుక్కులు అభం శుభం తెలియని నాలుగేళ్ల పసిబాలుడ్ని పొట్టనపెట్టుకున్నాయి. మూకుమ్మడి దాడి చేసి మరీ ప్రాణాలు తీశాయి. తన శక్తి మేర కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. అవి జంతువులను వేటాడినట్లు వేటాడి.. కసితీరా రక్కి చంపేశాయి. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ లోని అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ కుటుంబం కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చింది. ఛే నంబరు చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్‌లో గంగాధర్ వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, ప్రదీప్ (నాలుగేళ్ల కుమారుడు)తో కలిసి బాగ్ అంబర్ పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్ వద్దకు పిల్లల్నితీసుకుని వెళ్లాడు. కూతుర్ని పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్ లో ఉంచి, కుమారుడ్ని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. అయితే ప్రదీప్ అక్కడ ఆటలో మునిగి పోవడంతో తండ్రి మరో వాచ్ మెన్ తో కలిసి పనిమీద బయటకు వెళ్లాడు. అయితే అక్కడే కాసేపు ఆడుకున్న ప్రదీప్.. అక్క క్యాబిన్ లో ఉన్న సంగతి గుర్తుకు వచ్చి అక్కడకు బయలు దేరాడు.
క్యాబిన్ వైపు వెళుతుండగా.. ఒక్కసారిగా కుక్కలు ప్రదీప్ పై ఎగబడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ బాబును కుక్కలు వదల్లేదు. ఎటు వెళ్లినా.. వదలకుండా మూకుమ్మడి దాడి చేశాయి. ఇష్టమొచ్చినట్లు కొరుకుతూ, తీవ్రంగా గాయపరిచాయి. అయితే తమ్ముడి అరుపులకు బయటకు వచ్చిన సోదరి పరుగున వెళ్లి తండ్రికి సమాచారం ఇచ్చింది. తండ్రి వచ్చి వాటిని బెదిరించడంతో బాలుడ్ని వదిలేశాయి. తీవ్రంగా గాయపడిన కుమారుడ్ని ఆసుప్రతికి తరలించినప్పటికీ ఫలితం వృథాగా మారింది. ఆసుప్రతికి వచ్చే సరికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.