హైదరాబాద్- కరోనా కాస్త సద్దుమణిగిందని అంతా రిలాక్స్ అవుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్ ముంచుకొచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని మళ్లీ ఆందోళనలో పడేసింది. మెల్ల మెల్లగా ఈ వేరియంట్ కేసులు పలు దేశాల్లో వెలుగు చూస్తున్నాయి. దీంతో అన్ని దేశాలు మళ్లీ అప్రమత్తమయయాయి. కరోనా నిబంధనలను కఠినతరం చేశాయి.
మన భారత ప్రభుత్వం సైతం దేశంలో కరోనా ఆంక్షలను తిరిగి అమల్లోకి తీసుకువచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో హైదరాబాద్ లో కరోనా కలకలం రేపుతోంది. ఒకే నివాస సముదాయంలో పది మందికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో పీరం చెరువులో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్థానిక గిరిధారి అపార్ట్ మెంట్‌లో ఒకేసారి 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అపార్ట్ మెంట్ వాసికి కరోనా సోకింది. అతని నుంచి అపార్ట్ మెంట్‌లో ఉన్న వ్యక్తులకు వైరస్ సోకినట్లు చెబుతున్నారు.
ఒకేసారి 10 మందికి కరోనా సోకడంతో అపార్ట్‌మెంట్ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అప్రమత్తమైన బండ్లగూడ మున్సిపల్ అధికారులు, అపార్ట్‌మెంట్ మొత్తం శానిటైజేషన్ చేశారు. ఆదివారం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ కోవిడ్ రాపిడ్ టెస్ట్ చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా సోకిన వారు చుట్టు పక్కల ఎవరెవరిని కలిశారో వివరాలు సేకరిస్తున్నారు. వారందరికి కూడా కరోనా పరీక్షలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.