టీమిండియాకు కొత్త కోచ్‌ను వెతికే పనిలో బీసీసీఐ ఉంది. ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. ఆ లోపు కొత్త ప్రధాన కోచ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ చర్యలు మొదలెట్టింది. అందులో భాగంగానే గతంలో 2016-17 మధ్య కాలంలో టీమిండియా కోచ్‌గా ఉన్న భారత మాజీ లెజండరీ లెగ్‌స్పిన్నర్ అనిల్ కుంబ్లేను, మని కట్టు మాత్రీకుడు, మాజీ ఇండియన్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్‌లను బీసీసీఐ సంప్రదిస్తున్నట్లు బలమైన సమాచారం. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ అడ్వజరీ కమిటీ సభ్యులుగా ఉన్న కాలంలో అనిల్ కుంబ్లేను టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఏడాది కాలానికే కోచ్ పదవికి రాజీనామా చేశారు. దానికి కెప్టెన్ కోహ్లీతో ఉన్న విభేదాలే కారణం అన్నది బహిరంగ రహస్యం.
2017లో చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కుంబ్లే కంటే ముందు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రినే కోహ్లీ ఒత్తిడితో మళ్లీ టీమిండియా కోచ్‌గా నియమించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయనే కోచ్‌గా, కోహ్లీ కెప్టెన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీ20 జట్టుకు కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించడం. రవిశాస్త్రి పదవికాలం ముగుస్తుండడంతో కుంబ్లేతో పాటు లక్ష్మణ్‌ను కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కోరినట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరులో ఒకరు టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉండాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కుంబ్లేకు అవకాశాలు ఎక్కువ..
టీమిండియా ప్రధాన కోచ్ పదవికి కుంబ్లేకే మెరుగైన అవకాశాలు ఉన్నాయి. దానికి కోచ్‌గా అతని గణాంకాలే ఉదాహరణ. కుంబ్లే కోచ్‌గా టీమిండియా 17 టెస్టులు ఆడింది అందులో 12 విజయాలు, 19 వన్డే మ్యాచ్‌లు ఆడగా 13 విజయాలను సొంతం చేసుకుంది. విజయాల శాతంలో టీమిండియాకు కోచ్‌లు పనిచేసిన అందరి కంటే ఎక్కువ టెస్టుల్లో 70.59, వన్డేల్లో 68.42 ఉంది. ప్రస్తుతం కోచ్ రవిశాస్త్రి, 2011 వన్డే వరల్డ్ కప్ అందించిన గ్యారీ క్రిస్టెన్, అనంతరం కోచ్‌గా వచ్చిన డక్కెన్ ఫ్లెచర్, గంగూలీ కెప్టెన్ గా ఉన్న కాలంలో ఉన్న జాన్ రైట్, గ్రెగ్ చాపెల్ కంటే కుంబ్లేనే మెరుగైన పర్సటెంజ్ కలిగి ఉన్నాడు. కుంబ్లే కోచ్‌గా కేవలం ఒక్క టీ20 సిరీస్ ను మాత్రమే ఇండియా కోల్పోయింది.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లను సైతం మట్టికరిపించింది. 2017లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓడిపోవడం, కోహ్లీతో ఉన్న విభేదాల కారణంగా ఆయన కోచ్ పదవికి రాజీనామా చేశారు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఉండగా కుంబ్లే టీమిండియా కోచ్ అయ్యారు. ఇప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు. కుంబ్లే టాలెంట్‌పై అపారమైన నమ్మకున్న దాదా మళ్లీ టీమిండియాకు కోచ్‌గా ఉండాలని కోరినట్లు సమాచారం. కుంబ్లే నో అంటే లక్ష్మణ్ టీమిండియా కోచ్‌గా ఎంపికయ్యా అవకాశం ఉంది. ప్రస్తుతం లక్ష్మణ్ ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటర్‌గా ఉన్నారు.
