మారిన ఆధునిక జీవన విధానంలో ప్రజలకి బ్యాంకింగ్ సేవలు అనివార్యం అయ్యాయి. ఏవైనా కొన్ని కారణాల చేత బ్యాంకులకి ఒకటి, రెండు రోజులు సెలవు వస్తేనే ప్రజల ఆర్ధిక లావాదేవీలు స్తంభించి పోతుంటాయి. అలాంటిది ఒకే నెలలో బ్యాంకులకి 15 రోజుల సెలవులు వస్తే..? అమ్మొ.. వినడానికే భయంగా ఉంది కదా? రానున్న కొత్త సంవత్సరంలోని మొదటి నెలలలోనే ఇలాంటి పరిస్థితిని ప్రజలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడింది.
బ్యాంకింగ్ రంగానికి సెలవులు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఆ మార్గ దర్శకాల ప్రకారం రానున్న జనవరి నెలలో.. దేశంలోని అన్నీ రాష్ట్రాలలో కలిపి చూసుకుంటే కేవలం 16 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. సాధారణంగా రెండో శనివారం, నాలుగో శనివారం, ఇతర జాతీయ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇవికాక ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మరికొన్ని బ్యాంకు సెలవులు ఉంటాయి. మరి.. జనవరి 2022లో ఏరోజు, ఏయే రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఇక జనవరి 2 ఆదివారం. కాబట్టి.. బ్యాంకింగ్ రంగానికి ఇక్కడ వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.
ఇక జనవరి 4న లోసూంగ్ సందర్భంగా సిక్కింలో బ్యాంకులకి సెలవు. తరువాత జనవరి 8 రెండవ శనివారం, 9 వ తేదీ ఆదివారం కాబట్టి దేశంలో ఎక్కడా ఈ రెండు రోజులు బ్యాంకింగ్ రంగ సేవలు అందుబాటులో ఉండవు. జనవరి 11 మిజోరంలో మిషనరీ డే. ఇక జనవరి 12 స్వామి వివేకానంద పుట్టినరోజు. ఇలా మొదటి రెండు వారాల్లోనే చాలా సెలవులు ఉన్నాయి.