దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ప్రభుత్వ పథకాలు అందాలన్నా.. ఆధార్ ఖచ్చితంగా ఉండాలి. కానీ, చాలా మంది ఆధార్ కార్డులో పేర్లు తప్పుగా పడటం వల్ల, లేదా పెళ్లయ్యాక మహిళలు ఇంటిపేరు మార్చుకోలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.
అందుకే.. UIDAI ఒక సరికొత్త గుడ్ న్యూస్ చెప్పింది! పేరు మార్పులు, తప్పుల సవరణల కోసం ఒక సరికొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని అమలుల్లోకి తెచ్చింది. ఇకపై పేరులో ఇనిషియల్స్ మార్చడం, మిడిల్ నేమ్ యాడ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? ఏ తప్పులకి ఏ డాక్యుమెంట్లు కావాలి? ఎంత ఖర్చవుతుంది? అనే పూర్తి వివరాలు ఈ 4 నిమిషాల వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం.
మొదటగా.. పేరులో చిన్నపాటి తప్పులు ఉన్నవారి గురించి మాట్లాడుకుందాం. దీన్ని UIDAI ‘మైనర్ చేంజెస్’ కేటగిరీ కింద చేర్చింది. ఉదాహరణకు మీ పేరులో ‘K’ అని మాత్రమే ఉండి, దాన్ని పూర్తి పేరుగా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. మీ పేరులో కుమార్, రావు, ప్రసాద్ లాంటి మధ్య పేరును కొత్తగా జోడించాలన్నా, లేదా ఉన్నదాన్ని తీసేయాలన్నా ఇప్పుడు అవకాశం ఇచ్చారు. మీ ఇంటిపేరు వెనుక ఉంటే ముందుకు, ముందు ఉంటే వెనుకకు మార్చుకునే వెసులు బాటు కల్పిస్తున్నారు. పేరు పలికే విధానం ఒకేలా ఉండి, టైపింగ్ లో అక్షరాలు తప్పు పడినా.. లేదా పేరు మధ్యలో Dots తొలగించాలన్నా ఈ కేటగిరీ కింద చేసుకోవచ్చు. దీని కోసం మీ దగ్గర ఏదైనా ఒక సరైన గుర్తింపు కార్డు అంటే పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్ట్ లాంటివి ఉంటే సరిపోతుంది.

ఇక రెండోది.. డేటా ఎంట్రీ తప్పులు. అంటే, మీరు ఆధార్ సెంటర్ లో అప్లై చేసినప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికెట్‌లో పేరు కరెక్ట్ గానే ఉంటుంది, కానీ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ తప్పుగా టైప్ చేస్తారు. ఇలాంటి వాటిని సరిచేయడానికి పెద్దలు అనుబంధం-బి అఫిడవిట్ తో పాటు మీ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఇక మూడోది.. చాలా ముఖ్యమైనది. వివాహిత మహిళల పేరు మార్పు. పెళ్లయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత మహిళలు తమ ఇంటిపేరును మార్చుకోవడానికి UIDAI ప్రత్యేక నిబంధనలు తెచ్చింది. వివాహం తర్వాత భర్త ఇంటిపేరును చేర్చుకోవాలనుకునే మహిళలు తమ Marriage Certificate లేదా చట్టబద్ధమైన పత్రాలతో పాటు, నిర్దేశిత అఫిడవిట్ సమర్పించి తమ పేరును అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఉన్న పేరును పూర్తిగా మార్చేసి, సరికొత్త పేరును పెట్టుకోవాలనుకుంటే దాన్ని ‘మేజర్ నేమ్ చేంజ్’ కింద పరిగణిస్తారు. దీని ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దీని కోసం మీరు ఖచ్చితంగా ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గెజిట్‌లో మీ పేరు మార్పు ప్రచురితమైన తర్వాతే ఆధార్ లో పూర్తి పేరు మారుస్తారు.
ఈ మార్పులన్నీ ఆన్‌లైన్‌లో కేవలం రిక్వెస్ట్ పెట్టుకోవడానికే కుదురుతుంది కానీ, ఫైనల్ ప్రాసెస్ కోసం మీరు ఖచ్చితంగా మీకు దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ మీ బయోమెట్రిక్స్ వెరిఫికేషన్ చేస్తారు. ఈ సర్వీస్ కోసం ప్రభుత్వం కేవలం రూ. 50 ఫీజు మాత్రమే నిర్ణయించింది.
చూశారు కదా! ఆధార్ లో పేరు తప్పులు ఉంటే టెన్షన్ పడకండి. ఈ కొత్త నిబంధనల ప్రకారం వెంటనే మీ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని, ఆధార్ కేంద్రాన్ని సందర్శించండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఎందుకంటే ఆధార్ లో తప్పుల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వారికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది.
