స్పెషల్ డెస్క్– పిల్లల కోసం చాలా మంది అల్లాడిపోతుంటారు. పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా కొంత మందికి పిల్లలు పుట్టకపోవడంతో తీవ్ర ఆవేధన చెందుతుంటారు. కానీ కొందరికి మాత్రం ఇలా పెళ్లి కాగానే అలా పిల్లలు పుడుతారు. ఇదిగో గుజరాత్ లోని దంపతులకు చాలా లేటు వయసులో పిల్లలు పుట్టడంతో వారి ఆనందానికి అంతే లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 ఏళ్ల వయసులో ఓ వృధ్ద మహిళ బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ అరుదైన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని మోరా ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే 75 ఏళ్ల జివున్ బెన్ రబరి, 70 ఏళ్ల బల్ధారి దంపతులు. వారికి పెళ్లై అక్షరాల 45 సంవత్సరాలు అవుతోంది. కానీ వాళ్లకి పిల్లలు పుట్టలేదు. పెళ్లైన కొత్తలో పిల్లల కోసం ఎన్నో గుళ్లు, గోపురాలు తిరిగి చాలా పూజలు, వ్రతాలు చేశారు. కానీ ఎంతకీ పిల్లలు పుట్టకపోవడంతోఇక లాభం లేదని వదిలేశారు.
ఐతే వాళ్లు వృధ్యాప్యంలోకి వచ్చాక, తమ వంశ వారసులు ఎవరు లేకపోతే ఎలా అని ఆవేధన చెందారు. ఇప్పుడు వైద్య రంగం బాగా అభివృద్ది చెందింది కాబట్టి, రబరి, బల్ధారి దంపతులు మోరా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించారు. అక్కడి వైద్యులు వీరిని పరిక్షించి కృత్రిమ గర్భధారణ ద్వార పిల్లలు పట్టే అవకాశం ఉందని చెప్పారు.
దీనికి వారు అంగీకరించడంతో వైద్యులు ఐవీఎఫ్ పద్దతిలో ఆ వృధ్ద మహిళకు గర్భం వచ్చేలా చేశారు. ఇంకేముంది ఐవీఎఫ్ సక్సెస్ కావడంతో ఆమె గర్భం దాల్చి, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ దంపతుల సంతోషం అంతా ఇంతా కాదు. ప్రపంచంలో లేటు వయసులో తల్లి అయిన వారి సరసన బల్ధారి కూడా చేరిపోయింది.