మరోసారి వైట్ హౌస్ నుంచి భారత్కు గట్టి షాక్ తగిలింది. మిత్రదేశం అంటూనే వాణిజ్య చర్చల్లో సుంకాలను ఆయుధంగా వాడుకుంటోంది అమెరికా.
తాజాగా నిన్న అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం — అంటే USTR — విడుదల చేసిన ప్రతిపాదనలు అంతర్జాతీయ వాణిజ్య ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే భారతీయ ఉత్పత్తులపై 17 శాతం సుంకంతో సరిపెట్టుకోవచ్చట.. లేదంటే ఏకంగా 25 శాతం వరకు అదనపు టారిఫ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందట! ఇది కేవలం పన్నుల లెక్క మాత్రమే కాదు.. భారత ఎగుమతులపై, మన పరిశ్రమలపై పడుతున్న తీవ్రమైన ఒత్తిడి… ఓ పక్క భారత్ తమకు మిత్రదేశామంటునే..సైలెంట్ గా వెన్నుపోటుపోడిచేందుకు సిద్దమైయ్యాడు ట్రంప్
ఇక అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ నేతృత్వంలోని USTR మొత్తం 14 ఆర్థిక వ్యవస్థలపై జరిపిన దర్యాప్తు తర్వాత ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చింది.
ఈ జాబితాలో భారత్తో పాటు చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, థాయ్లాండ్, సింగపూర్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. అమెరికా చెబుతున్న కారణం ఏమిటంటే — ఈ దేశాలు తమ దేశీయ మార్కెట్ అవసరాలకు మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని, ప్రభుత్వ విధానాల ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రపంచ మార్కెట్లలో అధిక ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని ఆరోపిస్తోంది. దీనివల్ల అమెరికా తయారీ రంగం, స్థానిక పరిశ్రమలు, ఉద్యోగాలపై ప్రభావం పడుతోందన్నది ట్రంప్ సర్కార్ వాదన. కానీ ఆచరణలో చూస్తే, వాణిజ్య చర్చల్లో తనకు అనుకూలమైన షరతులను సాధించుకోవడానికి సుంకాలను ఒక బేరసారాల అస్త్రంగా వాడుకుంటున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ప్రతిపాదనల్లో భారత్కు సంబంధించిన అంశమే అత్యంత కీలకం. భారతీయ వస్తువులపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించారు. భారత్ అమెరికాతో పరస్పర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే ఈ రేటును 17 శాతానికి తగ్గించే అవకాశం కల్పించారు. చర్చలు కొలిక్కి రాకపోతే 25 శాతం భారం పడుతుంది.. ఒప్పందం కుదిరితే 17 శాతానికి తగ్గుతుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ ప్రతిపాదనలు చర్చల వేగాన్ని, ఒత్తిడిని పెంచేలా ఉన్నాయి…మరోపక్క భారత్ కాకుండా ఇతర దేశాల విషయానికి వస్తే.. వియత్నాంపై 35 శాతం వరకు, చైనాపై 20 శాతం వరకు,
బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయ్లాండ్లపై 18 శాతం వరకు యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్లపై 15 శాతం వరకు అదనపు సుంకాల ప్రతిపాదనలు ఉన్నాయి. కొన్ని దేశాలకు ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాలు, సుంకాలను పరిగణనలోకి తీసుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు.
ఇక ఇందులో మనకు ఒక ఊరట కలిగించే విషయం ఏమిటంటే — ఈ సుంకాలు వెంటనే అమల్లోకి రావడం లేదు. 2027 జనవరి 5 వరకు.. ప్రజలు, వాణిజ్య వర్గాలు, పరిశ్రమల నుంచి లిఖితపూర్వక అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత సంబంధిత విచారణలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఈ మధ్య కాలంలో దౌత్యపరమైన, వాణిజ్యపరమైన చర్చలకు ఇంకా సమయం ఉంది. భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూ ఎలాంటి ఒప్పందానికి వస్తుందన్నది కీలకం. మొత్తానికి ట్రంప్ సర్కార్ సుంకాలను ఒత్తిడి సాధనంగా వాడుకుంటోందన్నది స్పష్టం. భారత్కు 17 శాతం వద్ద ఊరట లభిస్తుందా? లేక 25 శాతం వరకు టారిఫ్ల భారం పడుతుందా? అన్నది రానున్న వాణిజ్య చర్చలు, జనవరిలో జరిగే విచారణల తర్వాత స్పష్టమవుతుంది.
