Unstoppable 2: నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మొట్టమొదటి టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో సూపర్ హిట్ అయింది. మొదటి సీజన్ ఎంతో అద్భుతంగా ముగిసింది. ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 శుక్రవారం మొదలైంది. ఈ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ గెస్ట్‌లుగా టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ బాబు పాల్గొన్నారు. ఇక, ఈ మొదటి ఎపిసోడ్ కొంత ఎమోషనల్‌గా.. కొంత సరదాగా సాగింది. బావ, బావమరిది ఫన్నీగా మాట్లాడుకున్నారు.
ఒకరిపై ఒకరు చిలిపి పంచులు వేసుకున్నారు. ఈ సందర్భంగా యూత్ గురించి ఇద్దరి మధ్యా ప్రస్తావన వచ్చింది. బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ బావ.. యూత్ గురించి ఎప్పటికీ అర్థం చేసుకోలేనిది.. మా యూత్ గురించి మీరు అనుకునే ఒక విషయం ఏంటి?’’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇందుకు చంద్రబాబు ‘‘మీ యూత్ అంటే ఏంటి?’’ అని తిరిగి ప్రశ్నించారు. దీంతో షోలో నవ్వులు పూశాయి. ఆ వెంటనే బాలకృష్ణ ‘‘ మేమందరం యూతేగా’’ అని అన్నారు. దానికి చంద్రబాబు ‘‘ నువ్వు కూడా సీనియర్ సిటీజనే కదా!.. రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి బావ. మీరు నటించటానికి రంగు వేసుకుని కవర్ చేస్తున్నారు.
నేను అది వేసుకోకుండా.. ఆలోచనా విధానంలో ఇప్పుడు ఉండే యంగ్‌స్టర్స్ అందరికంటే ముందుంటాను. మీరు యాక్టింగ్‌లో యంగెస్ట్.. నేను ఆలోచనల్లో యంగెస్ట్’’ అని అన్నారు. దానికి బాలకృష్ణ నవ్వుతూనే ‘‘ ఇప్పుడు నా జట్టు నెరిసిందని చెప్పటం అవసరమా.. గెస్ట్ లాగా మిమ్మల్ని పిలిస్తే.. ప్రేమగా పిలిస్తే.. నేను ఓల్డ్ అంటారా?.. నేను ఓల్డ్ కాదు.. గోల్డ్’’ అని అన్నారు. ఇక, హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి మరి.