తెలుగు కళామతల్లి సైతం గర్వించ దగ్గ సినిమా దర్శకులు చరిత్రలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారి వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కింది. తెలుగు సినిమాకు సినిమా చరిత్రలో చెరిగిపోని చోటు దక్కింది. అలా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుల్లో నాటి, మేటి దర్శకుడు విఠలాచార్య పేరు ఇప్పటికీ, ఎప్పటికీ చరితార్థమే. 1992 వరకు ఈయన సినిమాలంటే ప్రేక్షకులు ప్రాణం ఇచ్చేవారు. విఠలాచార్య సినిమాలు ఇప్పుడు టీవీలో వచ్చినా టీవీలకు అతుక్కుపోవటం పరిపాటి. ఆయన సినిమాకు కొత్త హంగులు దిద్దారు. ప్రేక్షకులను తన సినిమా నైపుణ్యం, పనితనంతో కొత్త లోకాలకు తీసుకెళ్లారు.
మాతృ భాష కన్నడ.. తెలుగు మీద మమకారంతో..
విఠలాచార్య తెలుగు వ్యక్తి కాదు. ఆయనది కర్ణాటక. ఒకప్పటి బ్రిటీష్ ప్రభుత్వంలోని ఉడిపిలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటినుంచి డ్రామాలు, యక్షగానం మీద ఆసక్తి చూపేవారు. పెద్దయ్యాక స్నేహితులతో మైసూర్ వెళ్లారు. అక్కడ వారితో ఓ సినిమా ప్రొడక్షన్ కంపెనీని మొదలుపెట్టారు. తర్వాత 1953లో సొంతంగా ఓ కంపెనీని మొదలుపెట్టారు. ‘‘రాజ్య లక్ష్మి’’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించటం విశేషం. ఓ మూడు సినిమాలు తీసిన తర్వాత మద్రాస్‌కు వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లిన తర్వాతి నుంచి తెలుగు సినిమాలు తీయటం మొదలుపెట్టారు. ఆయన మాతృ భాష కన్నడలో కూడా తియ్ననన్ని సినిమాలు తెలుగులో తీశారు. ఆయన చివరి సినిమాను కూడా తెలుగులోనే తీశారు.
జానపద బ్రహ్మ.. గ్రాఫిక్స్ లేని కాలంలో అద్భుతాలు..
ఆయన సినిమాలు చేసే కాలానికి గ్రాఫిక్స్ లేవు.. ఒక వేళ ఉన్నా ఆ గ్రాఫిక్స్‌ను ఉపయోగించి సినిమాలు చేసే స్థాయి తెలుగు సినిమాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా విఠలాచార్య అద్భుతాలను సృష్టించారు. కేవలం కెమెరా టెక్నిక్‌లు, మూమెంట్లతో అద్భుతాలను చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ ఉండి కూడా చేయలేకపోతున్న దాని బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే ఆయన చేశారు. మాయలు, మంత్రాలు, దెయ్యాలు, బూతాలతో జనాల్ని పిచ్చపిచ్చగా మెప్పించారు. జానపద సినిమాల్లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. జానపద బ్రహ్మగా తెలుగు ప్రజలతో కీర్తించబడ్డారు. తమిళంలో మాయాజాల మన్నన్‌గా మెప్పుపొందారు.
1980లలోనే త్రీడీ సినిమా.. దెయ్యాల సినిమాలకు కేరాఫ్ అడ్రస్
అప్పుడప్పుడే కలర్ సినిమాలు తెలుగులో ఊపందుకుంటున్నాయి. ఒకరకంగా కలర్‌లో సినిమా చేయటం అన్నది ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి సమయంలో విఠలాచార్య ఓ కొత్త ప్రయోగానికి తెరతీశారు. తెలుగులో తొలి త్రీడీ సినిమాను తీయటంలో భాగమయ్యారు. 1984 జై బేతాళ అనే త్రీడీ సినిమాను తీశారు. అయితే, ఈ సినిమాకు స్టోరీని, స్క్రీన్ ప్లేను మాత్రమే విఠలాచార్య అందించారు. ఇక, విఠలాచార్య సినిమా అంటే పిశాచాలు, దెయ్యాలు గుర్తుకు వస్తాయి. మదన మోహిని, జగన్మోహిని, మోహినీ శపథం వంటి సినిమాలతో అప్పటి ప్రేక్షకులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఈ సినిమాలలో తెల్ల దుస్తుల్లో ఉండే పిశాచాలు, దెయ్యాల గెటప్‌లు చాలా ఫేమస్ అయ్యాయి. దెయ్యాలు అంటే ఇలానే ఉంటాయేమో అనుకునేలా గెటప్‌లను తయారు చేశారు.
విఠలాచార్య ఉంటే ఆస్కార్ వచ్చేది!
ఇప్పుడు గ్రాఫిక్స్ ఉపయోగించి రాజమౌళి చేస్తున్న వండర్స్ 30 ఏళ్ల క్రితమే విఠలాచార్య చేశారు. 1992లో ఆయన చివరి సినిమా వచ్చింది. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ఆయన సినిమాలకు దూరం అయ్యారు. 1999లో తుదిశ్వాస విడిచారు. ఒకవేళ ఆయన బతికుండి సినిమాలు తీస్తూ ఉండి ఉంటే.. తెలుగుకు ఎప్పుడో ఓ 20 ఏళ్ల క్రితమే ఓ ఆస్కార్ కచ్చితంగా వచ్చేది అనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. సినిమాలు చేసినంత కాలం ఆయన హాలీవుడ్ డైరెక్టర్‌లకు ఏమాత్రం తీసిపోకుండా సినిమాలు చేశారు. తన సినిమాలను మొత్తం ప్రయోగాలకు వేదికగా చేశారు. ప్రతీ సినిమాలో ఓ కొత్త దనాన్ని జొప్పించారు.