మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి తెలియని వారుండరు. ఎన్నో బాలీవుడ్ హిట్ చిత్రాలతో ఆమె ఆడియెన్స్ మనసు దోచుకున్నారు. అలాంటి సుస్మితకు సంబంధించిన ఓ వార్త ఆమె ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడంలో ఆమె ముందుంటారు. డ్యాన్సులతోనూ లక్షలాది మంది ఫ్యాన్స్‌ను ఆమె సంపాదించుకున్నారు. ఈ మధ్య సినిమాలు తగ్గించిన సుస్మిత.. వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె నటించిన ‘ఆర్య’ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఓటీటీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో రెండో సీజన్‌ను కూడా రిలీజ్ చేశారు. అది కూడా సూపర్ హిట్‌గా నిలవడంతో ‘ఆర్య సీజన్ 3’ని రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇలాంటి సమయంలో సుస్మితా సేన్‌కు సంబంధించిన ఓ వార్త ఆమె ఫ్యాన్స్‌ను సడన్ షాక్‌కు గురి చేస్తోంది. మాజీ విశ్వసుందరి సుస్మితకు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇటీవల హార్ట్ ఎటాక్ రావడంతో ఆస్పత్రిలో చేరానని.. డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ కూడా వేశారని సుస్మిత వెల్లడించారు. సకాలంలో ట్రీట్మెంట్ అందించడంతో తాను వేగంగా కోలుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానంటూ అభిమానులను ఉద్దేశించి సుస్మితా సేన్ పోస్ట్ చేశారు. తనను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు. దేవుడు గ్రేట్ అనే ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా ఈ పోస్టుకు జత చేశారు.