ఎన్నో వేల పాటలు రాసిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన టాలీవుడ్‌లో బాగా ఇష్టపడే హీరో ఒకరున్నారు. ఆ హీరో కోసమే పాట రాసినట్లు కూడా శాస్త్రి ఒక సందర్భంలో చెప్పారు. ఆ హీరో మరెవరో కాదు.. అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన అలవైకుంఠపురం చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. వాటిలోని సామజవరగమన పాట ఆ చిత్రానికే హైలెట్‌గా నిలిచింది. ఆ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి.
ఈ పాట గురించి ఆయన మాట్లాడుతూ.. ‘అల వైకుంఠపురంలో..’ సినిమాలోని పాట ‘సామజవరగమన..’ చాలా బాగా వచ్చింది. ఈ పాటకు తమన్ చాలా చక్కగా సంగీతం అందించాడు అని అన్నారు. ఆర్కెస్ట్రా కూడా చాలా కష్టపడిందని అన్నారు. వైరుధ్యంగా.. కుర్రతనం.. తుంటరితనం.. కొంటెతనం ఉండే పాట రాయమని అడిగినప్పుడు కొన్ని క్లాసికల్ పదాలు రాయాలని అనిపించిందని, అందుకే కొన్ని పదాలను ఇందులో రాసినట్లు చెప్పారు. అటువంటి అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు అని తెలిపారు. సామజవరగమన అంటే అమ్మాయి గురించి వర్ణించే పదాలు అని, సామజవరగమన, మల్లెల మాసమా? విరిసిన పింఛమా..? దయలేదా నీకసలు అంటూ రాసిన పాట పదాలు అంతబాగా కుదరడానికి కారణం బన్నీనే అని చెప్పుకోవాలి.
అతడిని చూస్తే ఒళ్లు మరిచి పోతా అందుకే ఆ పాట రాశా అని అన్నారు. ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడని, ఓ మధ్యతరగతి కుర్రాడి పాత్రలో ఇందులో కూడా ఎంతో బాగా నటించాడని బన్నీ నటన గురించి మెచ్చుకున్నారు సిరివెన్నెల. ఇలా బన్నీపై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడు ఆయన మృతితో అల్లు అర్జున్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.