‘లవ్ స్టోరీ 2050’ అనే బాలీవుడ్ మూవీతో నటుడిగా పరిచయమైన కరణ్ మెహ్రా.. ‘ఎహ్ రిష్తా క్యా కెహ్లతా హై’ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు. పలు షోస్‌లో కంటిస్టెంట్గా చేసిన కరణ్.. పలు టెలివిజన్ సిరీస్‌లలో, మ్యూజిక్ వీడియోలలో కూడా నటించారు. కేసర్ సీరియల్ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నిషా రావల్‌ను 2012లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ 2021లో సెపరేట్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరణ్ మెహ్రా, తన మాజీ భార్యపై సంచలన ఆరోపణలు చేశారు. విడాకులు ఇంకా మంజూరు కాకముందే నిషా.. రోహిత్ సేతియా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అతడితో కలిసి తనపై దాడి కూడా చేసిందని ఆరోపించారు.
మొదట్లో రోహిత్ తనను తాను అన్నగా పరిచయం చేసుకున్నాడని, ఆ తర్వాత రాఖీ కట్టించుకున్నాడని అన్నారు. రాఖీ కట్టించుకున్న వ్యక్తితో.. నిషా నిస్సిగ్గుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ఆరోపించారు. మొదట్లో వీరి మధ్య ఈ వ్యవహారం నడుస్తుందన్న విషయం తనకు తెలియదని, ఇద్దరూ కలిసి తనను ఇంట్లోంచి వెళ్లగొట్టి దాడి చేశారని కరణ్ మెహ్రా అన్నారు. అంతేకాదు తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారని అన్నారు. రోహిత్ ఒక దుర్మార్గుడని, అతనికి మందు, సిగరెట్, గుట్కాపాన్ వంటి చెడు అలవాట్లు ఉన్నాయని ఆరోపించారు. అలాంటి వ్యక్తి తన ఇంట్లో.. తన మాజీ భార్యతో, తన కొడుకుతో ఉంటున్నాడని బాధపడ్డారు. ఇలాంటి వాళ్ళ దగ్గర తన కొడుకు ఉంటే చెడిపోతాడని, అందుకే కొడుకుని తనకి అప్పగించమని ఫైట్ చేస్తున్నానని వెల్లడించారు.
నిషా తానో సింగిల్ మదర్నంటూ సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తోందని, తన ఇంట్లో ఉంటూ, తన డబ్బులే వాడుకుంటూ తన మీద కేసు గెలవాలని చూస్తుందని అన్నారు. డాక్యుమెంట్స్, డబ్బులు, ల్యాప్‌టాప్.. ఇలా తనకు సంబంధించిన ప్రతీది ఆ ఇంట్లోనే ఉన్నాయని, తన ఇంటికి తాను వెళ్ళడానికి అనుమతి లేకుండా పోయిందని కరణ్ వాపోయారు. ఒక సూట్‌కేసులో 5 జతల బట్టలిచ్చి వెళ్ళగొట్టారని, 5 నెలల నుంచి రోడ్ల మీద పిచ్చోడిలా తిరుగుతున్నానని వెల్లడించారు.
కాగా తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ నిషా రావల్.. కరణ్‌పై గత ఏడాది గృహహింస కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించి, విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. మరి తన మాజీ భార్య రాఖీ కట్టించుకున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కరణ్ మెహ్రా ఆరోపణలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.