ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునేలోపు న్యూస్ వైరల్ అయిపోతుంది. అయితే అందులో ఉన్నవాళ్లు బాధపడే విషయం గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు చాలామంది.. సోషల్ మీడియాలోని కొన్ని పోస్టుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట చెప్పుకోలేక తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే విమర్శలు, ట్రోలింగ్ వరకు ఓకే గానీ కొన్నిసార్లు పలువురు సీనియర్ సెలబ్రిటీలు చచ్చిపోయారని కూడా పోస్టులు పెట్టేస్తున్నారు. దీంతో పలువురు నెటిజన్లు, అది నిజమేనేమో అనుకుని షేర్ చేసుకున్నారు. తీరా ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి.. సదరు సెలబ్రిటీలు కానీ, వాళ్ల బంధువులు గానీ తెగ ఆందోళన చెందుతారు. కొన్నాళ్ల ముందు సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్.. సీనియర్ నటుడు చంద్రమోహన్ విషయంలో జరిగింది. దీని గురించి స్వయంగా ఆయనే చెప్పారు. అప్పుడు తను ఫేస్ చేసిన అనుభవాలను బయటపెట్టారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు పెద్దగా తెలీకపోవచ్చు. కానీ కొన్నాళ్లు ముందుకు వెళ్తే.. ఆయన లేని సినిమా ఉండేది కాదు. ఎందుకంటే హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలు చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొన్నేళ్ల నుంచి ఆయన సినిమాల్లో కనిపించట్లేదు. దీంతో ఆయన గురించి చాలామంది మర్చిపోయారు. ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. తాజాగా సుమన్ టీవీ చంద్రమోహన్ ని కలిసి ఇంటర్వ్యూ కూడా తీసుకుంది. ఇందులో భాగంగానే తన హెల్త్ గురించి, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల వల్ల తను పడిన ఇబ్బంది గురించి ఆయన చెప్పారు. అప్పటి విషయాలని తలచుకుని బాధపడ్డారు. తనకు బైపాస్ సర్జరీ చేసి స్టంట్స్ వేసిన విషయం గురించి మీడియాలో రావడం వరకు బాగానే ఉంది. కానీ యూట్యూబ్ లో తప్పుడు ప్రచారాలు ఎక్కువయ్యాయని చంద్రమోహన్ అన్నారు.
తనకు చాలా సీరియస్ గా ఉందని పలు యూట్యూబ్ ఛానెల్స్ లో న్యూస్ రావడంతో.. అమెరికాలో ఉన్న కూతురు, అల్లుడు భయపడి తన దగ్గరకు వచ్చేశారని చంద్రమోహన్ చెప్పారు. తాను బాగానే ఉన్నానని స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం కిడ్నీ సమస్య రావడం వల్ల డయాలసిస్ చేయించుకుంటున్నానని చంద్రమోహన్ అన్నారు. మొదట్లో ఇది తనకు నచ్చక వద్దన్నాను కానీ ఇలానే జరిగితే కిడ్నీ మార్చాల్సి వస్తుందని డాక్టర్స్ హెచ్చరించడంతో దానికి ఒప్పుకొన్నానని ఆయన చెప్పారు. డయాలసిస్ చేయడానికి నెలకు రూ.60 వేల వరకు ఖర్చు అవుతుందని చంద్రమోహన్ చెప్పారు. ప్రస్తుతం ఇంట్లోనే మెషీన్ పెట్టి డయాలసిస్ చేయించుకుంటున్నానని, సరైన ఫుడ్ తింటూ డైట్ ఫాలో అయితే ఎలాంటి సమస్య రాదని డాక్టర్స్ చెప్పినట్లు చంద్రమోహన్ క్లారిటీ ఇచ్చారు.